భారీగా బలగాలను మోహరించిన పాక్
న్యూఢిల్లీ: సర్జికల్ దాడుల అనంతరం అసలు దాడులే జరగలేదంటూ బుకాయిస్తూ వస్తున్న పాకిస్తాన్ దూకుడు పెంచింది. పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లో సరిహద్దు వెంబడి భారీ స్థాయిలో సైన్యాన్ని మోహరించింది. దీంతోపాటు అక్కడ ఉన్న గ్రామాలను ఖాళీ చేయించినట్లు గుర్తించామని భారత ఇంటలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. అయితే.. దీనికి ప్రతిగా భారత్ కూడా ఎల్ఓసీ వద్ద భారీగా సైన్యాన్ని మోహరించిందని సీనియర్ ఆర్మీ అధికారి తెలిపారు.
మరోసారి ఇండియన్ ఆర్మీ పాక్ లాంచ్ ప్యాడ్స్ మీద దాడి చేసే అవకాశం ఉందని భయపడుతున్న నేపథ్యంలో పాక్ సైనిక బలగాల మోహరింపు చేపడుతుందని భావిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ అధికారి వెల్లడించారు. సర్జికల్ స్ట్రైక్స్ తరువాత ప్రతీకార చర్యకు పాల్పడాలన్న ఉద్దేశంతో ఉన్న పాక్.. అంతర్జాతీయంగా ఉన్న వ్యతిరేకత దృష్ట్యా నేరుగా సైన్యం ద్వారా కాకుండా ఉగ్రవాదుల రూపంలో ఫిదాయిన్ దాడులకు పాల్పడే అవకాశం ఉందని అధికారులు అంచనావేస్తున్నారు. సర్జికల్ దాడుల అనంతరం పాకిస్తాన్ లష్కర్-ఏ-తాయిబా, జైషే మహ్మద్ టెర్రర్ క్యాంపులను పీఓకే నుంచి తరలించినట్లు సమాచారం.