ఇంత అన్యాయమా?
బడ్జెట్ కేటాయింపులపై సీఎం కేసీఆర్ విస్మయం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం వివిధ శాఖలకు నిధులు కేటాయించిన తీరు చూసి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అవాక్కయ్యారు. ‘ఇదేం దేశం.. ఇదేం ప్రభుత్వం.. ఇంత అన్యాయం ఉంటుందా? అంటూ విస్మయం వ్యక్తం చేశారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖకు నిరుటితో పోలిస్తే సగానికి సగం నిధుల కోత వేసిన విషయం తెలియగానే... అసలు ఇది నిజమేనా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఏటేటా సంక్షేమానికి ఎంతో కొంత నిధులు పెరగాలి గానీ.. కోత వేయడమేంటని అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం సచివాలయంలో ఐసీడీఎస్, అంగన్‌వాడీ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి బాహాటంగానే ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర బడ్జెట్‌పై పెదవి విరిచారు. అంగన్‌వాడీ కార్యకర్తల సమస్యలు, వేతనాల పెంపునకు సంబంధించి ఈ సమావేశంలో చర్చ జరిగింది.
\అప్పటికే అంగన్‌వాడీ సమస్యలపై కేసీఆర్ సీఎంవో అధికారులతో పాటు ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య చర్చలు జరిపారు. అంగన్‌వాడీ కార్యకర్తలకు వేతనాలను రెండింతలు చేయాలనే తన ఆలోచనపై సాధ్యాసాధ్యాలను సమీక్షించారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఉన్న అంగన్‌వాడీ సెంటర్లకు కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ విభాగం నిధులు కేటాయిస్తుంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.16,000 కోట్లు నిధులు వచ్చాయని.. ఈసారి మరో రూ.4,000 కోట్ల నుంచి రూ. 5,000 కోట్లు అదనంగా వస్తాయనే అంచనాతో జీతాలు పెంచేందుకు సీఎం మొగ్గుచూపినట్లు తెలిసింది. శనివారం అంగన్‌వాడీ ప్రతినిధుల సమావేశం జరుగుతుండగానే... జైట్లీ బడ్జెట్ ప్రవేశపెట్టారు.
అప్పటికే అంగన్‌వాడీ కార్యకర్తల జీతాలను పెంచేందుకు భరోసా ఇచ్చిన సీఎం... ఎంత పెంచుతామనే స్పష్టమైన హామీ ఇచ్చే ఆలోచనతో స్త్రీ శిశు సంక్షేమ శాఖకు కేంద్రం ఈసారి ఎన్ని నిధులు కేటాయించిందో కనుక్కోవాలని అధికారులకు సూచించారు. ఈసారి రూ.8,000 కోట్లు కేటాయించారని అధికారులు బదులిచ్చారు. కంగుతిన్న సీఎం.. ఇదేం ప్రభుత్వమంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అదే సమావేశం నుంచి ఢిల్లీలో ఉన్న టీఆర్‌ఎస్ ఎంపీలతో ఫోన్లో మాట్లాడారు. బడ్జెట్‌పై జరిగే చర్చలో ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు.