
పడవ బోల్తా...ముగ్గురి జలసమాధి
ముంబై: జలాశయంలో పడవపై సరదాగా చేసుకున్న మద్యం పార్టీ ముగ్గురిని బలితీసుకుంది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ముంబై నగరానికి నీటిని సరఫరాచేసే పొవయి జలాశయంలో పడవ బోల్తాపడి ముగ్గురు మృతిచెందగా ఐదుగురిని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా బయటకు తీశారు. ఘాట్కోవర్, పొవయి, కల్యాణ్ పన్వేల్ ప్రాంతాలకు చెందిన 8 మంది మిత్రులు పొవయి జలాశయంలో పార్టీ చేసుకోవాలని నిర్ణయించి స్టీమర్‌ను బుక్‌చేసుకున్నారు. వీరందరూ శనివారం వేకువజామున స్టీమర్‌లో జలాశయం మధ్యలోకి చేరుకుని మద్యం పార్టీ ప్రారంభించారు.
ఇద్దరు మిత్రులు ఆలస్యంగా రావడంతో వారికోసం స్టీమర్‌ను ఒడ్డుకు తిప్పారు. ఇంతలో స్టీమర్ బోల్తాపడింది. ముగ్గురు యువకులు నీట మునిగారు. నీటిలో తేలుతున్న స్టీమర్‌ను పట్టుకుని వేలాడుతున్న ఐదుగురిని గమనించిన పోలీసులు కాపాడారు. నీటిలో మునిగిపోయిన దినేష్ భోయర్(34), రాసూల్ ఖాన్(47), అతీక్ లతీఫ్‌ఖాన్(22)ల మృతదేహాలను శనివారం రాత్రి పొద్దుపోయాక వెలికితీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి పంపారు.