గూగుల్‌ను కోర్టుకీడ్చిన మాజీ ఉద్యోగినులు
గూగుల్‌ను కోర్టుకీడ్చిన మాజీ ఉద్యోగినులు
Published Fri, Sep 15 2017 7:27 PM | Last Updated on Tue, Sep 19 2017 4:36 PM
న్యూయార్క్: సెర్చి ఇంజిన్ దిగ్గజం గూగుల్‌పై ముగ్గురు మాజీ మహిళా ఉద్యోగినులు దావా వేశారు. కంపెనీలో మహిళా ఉద్యోగినులకు తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారని, తక్కువ స్థాయి పొజిషన్లను ఆఫర్ చేస్తున్నారని ఆరోపిస్తూ వారు న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు. ఓ వైపు గూగుల్ కార్యాలయంలో ఈ పిర్యాదులపై అమెరికా కార్మిక శాఖ విచారణ జరుపుతుండగానే ఉద్యోగినులు దావా వేయడం గమనార్హం. 2015లో యూఎస్ కార్మిక విభాగం అధికారులు గూగుల్ ప్రధాన కార్యాలయంలో 21,000 మంది ఉద్యోగులను సర్వే చేసి పలు వివరాలు రాబట్టారు. వీరి విచారణలో మహిళా ఉద్యోగులకు తక్కువ వేతనాలు ఇస్తున్నారని, ప్రతి విభాగంలోనూ మహిళలకు చాలీచాలని చెల్లింపులు చేస్తున్నారని వెల్లడైంది.
ఇక న్యాయస్ధానాన్ని ఆశ్రయించిన ఉద్యోగినుల్లో ఒకరు మాజీ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కాగా, ఒకరు మాజీ కమ్యూనికేషన్స్ స్పెషలిస్ట్, మరొకరు గతంలో గూగుల్‌లో మేనేజర్‌గా పనిచేశారు. కంపెనీలో మహిళల పట్ల వివక్ష చూపుతున్నారని ఆరోపిస్తూ వీరు రాజీనామా చేశారు. మరోవైపు వీరు గూగుల్‌పై కేసు వేయడం పట్ల కంపెనీ ప్రతినిధి స్పందిస్తూ దీనిపై తాము పూర్తిగా సమీక్షిస్తామని, అయితే వారు చేసిన కీలక ఆరోపణలతో విభేదిస్తున్నామని వ్యాఖ్యానించారు.
Advertisement