సాక్షి, చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత కారాగార శిక్ష అనుభవిస్తున్న ఏడుగురు దోషులను విడుదల చేయాల్సిందిగా తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్‌కు ఆ రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసింది. ఆదివారం చెన్నైలో ముఖ్యమంత్రి పళనిస్వామి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు ఓ తీర్మానం చేసి గవర్నర్‌కు పంపింది. కాంగ్రెస్ మినహా తమిళనాడులోని మిగిలిన పార్టీలన్నీ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాయి. కేంద్ర ప్రభుత్వం కూడా రాజీవ్ హత్య దోషులను విడుదల చేసేందుకు విముఖంగా ఉండటం తెలిసిందే.
రాజీవ్ హత్య కేసులో మురుగన్, శాంతన్, అరివు, జయకుమార్, రాబర్ట్ పయాస్, నళిని, రవిచంద్రన్‌లు గత 27 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. రాజ్యాంగంలోని 161వ అధికరణం ప్రకారం వీరిని విడుదల చేసే అధికారం గవర్నర్‌కు ఉంటుంది. 2014లో జయలలిత సీఎం ఉండగానే దోషులను విడుదల చేయాలని నిర్ణయించినా కేంద్రం అప్పట్లో సుప్రీంను ఆశ్రయించడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. తాజాగా ఈ అంశంపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని సుప్రీంకోర్టు కూడా గవర్నర్‌కే వదిలేసింది. మరి ఇప్పుడు గవర్నర్ కేంద్రాన్ని కాదని దోషులను విడుదల చేస్తారా అని ప్రశ్నించగా, ఇది రాష్ట్ర ప్రభుత్వ, ప్రజల నిర్ణయమనీ, గవర్నర్ అందుకు అనుగుణంగా నడచుకోవాల్సిందేనని మంత్రి జయకుమార్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment