పాస్‌పోర్ట్ నిబంధనలు సరళం
న్యూఢిల్లీ: పాస్‌పోర్ట్ నిబంధనలు సులభతరం కానున్నాయి. పాస్‌పోర్ట్ కావాలనుకునే వారు సమర్పించాల్సిన డాక్యుమెంట్లు, ఇతర నిబంధనలను సరళతరం చేస్తూ భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నిబంధనలు త్వరలోనే అమలులోకి రానున్నాయి.
ఇంతకు ముందు నిబంధనల ప్రకారం.. 1989 జనవరి 26, ఆ తరువాత జన్మించిన వారు పాస్ పోర్ట్ కోసం తప్పనిసరిగా తమ డేట్ ఆఫ్ బర్త్(డీఓబీ) సర్టిఫికేట్‌ను సమర్పించాల్సి ఉండేది. ఈ డీఓబి తప్పనిసరి అన్న నిబంధనను మారుస్తూ దాని స్థానంలో.. బర్త్ సర్టిఫికేట్ (బర్త్ అండ్ డెత్స్ రిజిస్ట్రార్ లేదా మున్సిపల్ కార్పోరేషన్ ఇచ్చేది), పాఠశాలలో ఇచ్చే డేట్ ఆఫ్ బర్త్‌తో కూడిన సర్టిఫికేట్, పాన్‌కార్డ్, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఎన్నికల ఫోటో గుర్తింపు కార్డు లాంటి వాటిలో ఏదో ఒకటి సమర్పిస్తే సరిపోతుందని విదేశాంగ శాఖ ప్రకటనలో తెలిపింది.
దీంతోపాటు ఇంటర్ మినిస్ట్రియల్ కమిటీ అందించిన రిపోర్ట్‌లో పేర్కొన్న అంశాలను సైతం విదేశాంగ మంత్రిత్వ శాఖ అంగీకరించింది. దీని ప్రకారం సింగిల్ పేరెంట్ పిల్లలకు పాస్‌పోర్ట్ నిబంధనలు సరళం కానున్నాయి. ఈ మార్పులకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.