భౌ..భౌ..ఖరీదు రూ.9 కోట్లు | Too much cost for dogs | Sakshi
Sakshi News home page

భౌ..భౌ..ఖరీదు రూ.9 కోట్లు

Published Sat, Jun 13 2015 11:04 AM | Last Updated on Sat, Sep 29 2018 4:26 PM

భౌ..భౌ..ఖరీదు రూ.9 కోట్లు - Sakshi

భౌ..భౌ..ఖరీదు రూ.9 కోట్లు

శునకంతో మనిషికున్న అనుబంధం ప్రత్యేకమైంది. మానవుడు ఎన్ని జంతువులను మచ్చిక చేసుకున్నా మనుషులతో మమేకమవడంలో వీటిదే అగ్రస్థానం. ఇవి మానవులతో సమానమైన భావోద్వేగాలు ప్రదర్శిస్తాయని ఇటీవలి జరిగిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. మనకు నేస్తాలుగా, ఇంటికి కాపలాగా, నేరస్తులను పట్టించే జాగిలాలుగా.. ఎంతో సేవచేస్తున్నాయి. వీటికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విశేషాలు ఈ రోజు తెలుసుకుందాం..!
 
టూమచ్ కాస్ట్!
టిబెట్‌కు చెందిన మాస్తిఫ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన శునకం. ఈ జాతి కుక్కలు ఎక్కువ బొచ్చుతో  చాలా పెద్దగా ఉంటాయి.  చైనీయులకు వీటిపైన మక్కువ పెరిగి పోవడమే వీటి డిమాండ్‌కు కారణం. ఇవి ఏ ఇంటిలో ఉంటే ఆ కుటుంబానికి సిరిసంపదలు కలుగుతాయని చైనీయుల నమ్మకం. అందరూ వీటిని ఇష్టపడటం, వీటి జాతి క్రమేణా తగ్గిపోవడం.. కూడా వీటి ధర చుక్కలనంటడానికి మరో కారణం. గతంలో జర్మన్ షెఫర్డ్ జాతి కుక్క అధిక వ్యయమని అందరూ భావించేవారు. ఇప్పుడు ఆ రికార్డును మాస్తిఫ్ బద్దలుకొట్టింది.
 
నివసించే ప్రాంతం:
ఇవి టిబెట్‌లో పుట్టాయి. టిబెట్‌ను ఇతర దేశాలు ఆక్రమించకుండా కాపాడుతున్నవి ఈ శునకాలేనట. చప్పిడి ముక్కు, పొడవుగా ఉండే నోరు.. వీటి కుండే బొచ్చుతో మూసుకుపోయి ఉంటాయి. ఆ దేశంలో ఉండే మత సన్యాసుల వెంట ఇవి కాపలాగా తిరుగుతుంటాయి. వారికి పూర్తి స్థాయి రక్షణకు కల్పిస్తున్నాయి. ఎక్కువ బలంగా ఉండి, ప్రత్యర్థులను సమర్థంగా ఎదుర్కొంటాయి.
 
ఎక్కడైనా జీవించగలవు:
బాగా ఎత్తుగా ఉండే పర్వత ప్రాంతాల్లో నివసిస్తాయి. అలాగే సాధారణ మైదాన ప్రాంతాల్లోనూ జీవించగలవు.  చాలా మంది వీటిని పెంచుకోవడం ఒక సంప్రదాయంగా భావిస్తారు. చైనాలో బాగా ధనవంతుల ఇళ్లలో ఈ జాతి శునకాలు కనీసం 20కి తక్కువ కాకుండా ఉంటాయట. వీటిలో చిన్న కుక్కపిల్లే సుమారుగా రూ. 6 లక్షలకు పైగా ధర పలుకుతోంది. ఇది పెరిగి పెద్దదైతే దీని ధర ఎంతైనా ఉండొచ్చు. ఇటీవల చెనాకు చెందిన బొగ్గు గనుల ఆసామి యాంగ్ ఈ శునకాన్ని అక్షరాలా రూ. 9 కోట్ల 40 లక్షలు పెట్టి ఈ ఏడాది మార్చిలో కొనుగోలు చేశారు.
 
సినిమాలంటే పిచ్చి:
తూర్పుగోదావరి జిల్లా  కడియం గ్రామంలో భాస్కర థియేటర్ కేరాఫ్ అడ్రస్‌గా చేసుకుని ఒక కుక్క నివసిస్తోంది. అది రోజూ ఆ థియేటర్‌లో ఆడే నాలుగు షోలూ ఒక్కటి కూడా మిస్సవకుండా వీక్షిస్తుందట. అది ఎక్కడో ఒక మూలన ఉండి కాదు.. దర్జాగా కుర్చీలో కూర్చునే. సినిమా థియేటర్ గేటు తెరచిన శబ్దం వినగానే లోపలికి ప్రవేశిస్తుంది. ఇంటర్వెల్‌లో బయటకు రావడం, షో మొదలవ్వగానే లోపలికి పరుగెత్తడం దీనికి రోజూ మామూలేనట. దీన్ని సెంటిమెంట్‌గా భావించి ఆ థియేటర్ యజమాని కూడా ఆ శునకాన్ని చేరదీస్తున్నాడట.
 
బుల్లి శునకం:
ప్రపంచంలో అత్యంత చిన్న శునకం పేరు చిహ్వాహ్వా. పేరు నోరు తిరగడం లేదు కదూ! ఇది ఎంత చిన్నదంటే కేవలం 6 నుంచి 9 అంగుళాలు మాత్రమే ఉంటుంది. చిన్నది కదా అని చిన్నచూపు చూసేరు.. ఇది కరిస్తే మిగిలిన జాతుల కంటే రాబిస్ వచ్చే ప్రమాదం అధికమట.
 
పెద్ద శునకం:
ప్రపంచంలో అత్యంత పెద్ద శునకం ఇంగ్లిష్ మేస్టిన్. దీని బరువు 158 కిలోలు.
 
విగ్రహం:
కుక్కకి విగ్రహం పెట్టడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా..? మనుషుల్లోనే అతి కొద్ది మందికి మాత్రమే దక్కే ఇలాంటి అదృష్టం ై‘లెకా’ అనే కుక్క పిల్ల కొట్టేసింది. ఇంతకి ఎవరీ లైకా అనుకుంటున్నారా? అంతరిక్షంలోకి మానవులు వెళ్తే మనం గొప్పగా భావిస్తున్నాం. లైకా అనే ఈ శునకం మానువుల కంటే ముందే అంతరిక్షంలో అడుగుపెట్టి ఆ క్రెడిట్ కొట్టేసింది. అంతరిక్షంలో పరిస్థితులు తెలుసుకోవడం కోసం వ్యోమగాములు ముందుగా దీన్ని అంతరిక్షంలోకి పంపారు. అయితే అక్కడి వాతావరణ పరిస్థితులు తట్టుకోలేక చనిపోయింది. ఓ బృహత్తర కార్యం సాధించడంలో మానవులకు మార్గదర్శకంగా నిలిచి ఆ కార్యక్రమంలో అశువులు బాసిన దీని విగ్రహాన్ని ఇటీవల మాస్కోలో ప్రతిష్టించారు. 1953 నవంబర్ 3న లైకా అంతరిక్షయానం చేసింది.
 
ఎత్తైన శునకం:
ప్రపంచంలోనే ఎత్తైన కుక్క జాతి గ్రేట్ డేన్.  ఎత్తుగా ఉండటమే దీని ప్రత్యేకత.
 
అందాల పోటీలు:
ప్రతి ఏటా చాలా నగరాల్లో డాగ్‌షోలు జరుగుతాయి. వీటిలో శునకాలు సైతం ర్యాంప్ వాక్ చేస్తాయి. వాటి అందం, ప్రదర్శించిన విన్యాసాలను బట్టి వాటిలో విజేతలుగా ప్రకటించి బహుమతులు అందచేస్తారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement