సాక్షి, వెబ్ ప్రత్యేకం: నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరు చుట్టొస్తుంది అంటారు. ఊరేంటి.. ఈ భూగోళాన్నే చుట్టొస్తుంది. పైగా నిజాన్ని కూడా నమ్మలేనంతగా జనాలను మాయ చేస్తోంది. ఇంకేముందీ.. ఆ మాయనే జనాలు విశ్వసిస్తున్నారు. సత్యానికి, అసత్యానికి మధ్య ఉండే సన్నటి గీతను చెరిపేస్తున్నారు. అబద్ధాన్నే నిజమంటూ డప్పు కొట్టి మరీ ప్రచారం చేస్తున్నారు. కొన్నిసార్లు ఇవి నవ్వు తెప్పించవచ్చేమో కానీ, ఎక్కువసార్లు విధ్వంసాన్నే సృష్టిస్తాయి. అసత్య వార్తలు, తప్పుడు వదంతులు ఎంత వరకు దారి తీస్తాయనేదానికి కరోనా కాలంలో చక్కర్లు కొట్టిన ఫేక్ న్యూస్‌లే ఉదాహరణ. ఇందులో 35 శాతం వీడియోల ద్వారా, 29.4 శాతం మెసేజ్‌లు, 29.4 శాతం ఫొటో కోట్స్ , 2.2 శాతం ఆడియో క్లిప్స్ ద్వారా వ్యాప్తి చెందుతున్నాయని బూమ్ నివేదిక పేర్కొంది.
(ఫొటో కర్టసీ: బూమ్)
ఫేక్ వార్తలకు పట్టుకొమ్మలు...
► వాట్సప్
► ఫేస్‌బుక్
► ట్విటర్
► ఇన్‌స్టాగ్రామ్
► యూట్యూబ్
► కొన్ని వెబ్‌సైట్లు
► పలు యాప్స్
► ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్
అసత్య వార్తల రకాలు:
వ్యంగ్యాస్త్రాలు: ఇవి కేవలం సెటైరికల్‌గానే ఉంటాయి. ఉద్దేశపూర్వకంగా ఎలాంటి నష్టం కలిగించాలనుకోవు.
తప్పుదోవ పట్టించడం: వ‌్యక్తిగతంగా లేదా ఓ సమస్యపై తప్పుడు దురుద్దేశాన్ని ఆపాదించడం.
మోసం చేయడం: నిజాన్ని మార్చివేయడం, కప్పిపుచ్చడం.
కల్పితాలు: పూర్తిగా తప్పుడు కథను సృష్టించడం, హింస లేదా నష్టానికి పాల్పడటం.
తప్పుడు కలయిక: వార్తలోని ఫొటో, వీడియోకు అక్కడ పొందుపరిచిన సమాచారానికి సంబంధం లేకపోవడం.
అసందర్భోచితంగా వినియోగించడం: వార్తలోని సమాచారం నిజమే అయినప్పటికీ అసందర్భానికి వినియోగించడం, వేరే దానికి ఆపాదించడం
తారుమారు చేయడం: నిజమైన వార్త లేదా చిత్రాలను తారుమారు చేసి మోసం చేయడం.
కరోనా వైరస్ ఉనికిలోకి వచ్చిన తొలినాళ్లలో చైనా గురించి ఎన్నో అసత్యవార్తలు పుట్టుకొచ్చాయి. అలాగే మందు లేని ఆ మాయదారి రోగం పుట్టుక, చికిత్స, నివారణ, వ్యాప్తి, నియంత్రణ గురించి లెక్కలేనన్ని వార్తలు చక్కర్లు కొట్టాయి. ఆ తర్వాత దేశంలో కరోనాను నియంత్రించేందుకు లాక్‌డౌన్ అమలు చేయగా దాని కోసం కూడా లేనిపోని కల్పితాలు ప్రత్యక్షమయ్యాయి. ముఖ్యంగా మార్చిలో కోవిడ్‌పై తీవ్ర స్థాయిలో ఊహాగానాలు బయలుదేరాయి. వాటిని నమ్మకండి మహాప్రభో.. అంటూ ప్రభుత్వాలే స్వయంగా రంగంలోకి దిగాల్సిన పరిస్థితి దాపురించింది. గత ఆరు నెలల్లో కొత్తగా పుట్టుకొచ్చిన గాలి వార్తల్లో కొన్ని ముఖ్యమైనవి, నష్టాన్ని కల్గించినవేంటో చూద్దాం..
మతాన్ని లక్ష్యంగా చేసుకోవడం:
సాధారణంగానే భారత్‌లో మతవిశ్వాసాలు, మతాభిమానం ఎక్కువ. ఇదే సమయంలో ఏ కాస్త సందు దొరికినా ఇతర మతంపై బురదజల్లాలని చూసేవారూ ఎక్కువే. ఈ క్రమంలో దేశంలో కరోనా కేసులు అంతంతమాత్రంగా ఉన్న మార్చి తొలినాళ్లలో ఢిల్లీలో తబ్లిగి జమాత్ సభ్యులు నిర్వహించిన మర్కజ్ సమావేశం అనంతరం కేసులు పెద్దమొత్తంలో పెరిగాయి. ఆ కార్యక్రమానికి హాజరైన వారు తిరిగి స్వస్థలాలకు చేరుకోవడంతో కొత్త ప్రాంతాలకూ వైరస్ విస్తరించింది. ఈ ఘటనతో ముస్లింలపై తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. (తబ్లిగి జమాత్ సభ్యులను విడుదల చేయాలి..)
దీంతో ఇందులో పాల్గొన్న తబ్లిగి జమాత్ సభ్యులతో పాటు మొత్తం ముస్లింలను నిందిస్తూ వారిపై ప్రతికూలతను కల్పించే వదంతులు పెరిగాయి. ఈ క్రమంలో ఎన్నో వీడియోలు, తప్పుడు వార్తలను వారికి అన్వయిస్తూ దుష్ప్రచారం జరిగింది. పండ్లు అమ్ముకునే ముస్లిం వ్యక్తి వాటిపై ఉమ్ము రాసినట్లుగా, కరెన్సీ నోట్లపై మరో ముస్లిం వ్యక్తి ఉమ్ము అంటించినట్లుగా ఇలా ఎన్నో వీడియోలు వాట్సప్‌లలో చక్కర్లు కొట్టాయి. ఈ వీడియోలు ఫోన్లలో ప్రత్యక్షంగా కాగానే సామాన్య ప్రజలు భయాందోళనకు గురయ్యారు. తీరా వాటి గురించి లోతుగా ఆరా తీస్తే కొన్ని ఈ దేశంలోవి కావని, మరికొన్ని పాతవని తేలింది.
సీఏఏ అల్లర్లు:
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టం తమకు వ్యతిరేకమంటూ ఈశాన్య ఢిల్లీలో మైనారిటీ వర్గాలు నిరసనకు దిగాయి. ఈ క్రమంలో ఫిబ్రవరి 23న జఫరాబాద్‌లో సీఏఏ వ్యతిరేకవాదుల సభకు నిప్పు పెట్టారంటూ ఓ పుకారు దావానంలా వ్యాపించింది. ఇది మారణహోమానికి కారణమైంది. వదంతు అంటించిన నిప్పు కార్చిచ్చులా మారి కొన్నిరోజుల పాటు తీవ్రస్థాయి హింసాత్మక ఆందోళనలకు కారణమైంది. ఆందోళనకారులను తప్పుదోవ పట్టించేలా ఎన్నో నకిలీ వీడియోలు, ఫొటోలను ఉపయోగిస్తూ ప్రచారంలోకి వచ్చిన ఎన్నో అసత్య కథనాలు అగ్నికి ఆజ్యం పోసాయి. ఫలితంగా కోట్లాది ఆస్తి నష్టం జరగ్గా, సుమారు 50 మంది వరకు మరణించారు. (ఒక్క అబద్ధం ఢిల్లీ హింసకు కారణమైంది)
మాంసాహారం:
చాలామందికి ముక్క లేనిదే ముద్ద దిగదు. ప్రతి ఆదివారం ఇంట్లో నాన్‌వెజ్ ఉండాలనేది తప్పనిసరి అయిపోయింది. అయితే ఎప్పుడైతే సోషల్ మీడియాలో "మాంసాహారం తింటే కరోనా వ్యాపిస్తుంది- శాఖాహారం తీసుకుంటే కరోనా బారిన పడకుండా కాపాడుకోవచ్చు" అన్న వార్త మొదలైందో.. అప్పుడు పడింది పౌల్ట్రీకి దెబ్బ. ముఖ్యంగా చికెన్ అమ్మకాలు భారీగా పడిపోయాయి. కొన్ని చోట్ల మూడు రూపాయలకే కోడిని అమ్ముకోగా మరికొన్ని చోట్ల మరీ దారుణంగా ఉచితంగానే కోళ్లను పంచాల్సిన దుస్థితి ఏర్పడింది. దేశవ్యాప్తంగా పౌల్ట్రీ పరిశ్రమ దాదాపు 12-13 వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. దీంతో ఆఖరికి ప్రభుత్వాలే ఈ అసత్య వార్తను ఖండించి పౌల్ట్రీని ఆదుకునే ప్రయత్నం చేయాల్సి వచ్చింది. ఈ వదంతుల ప్రభావం సోయాబీన్, మొక్కజొన్న రైతులపైనా పడింది. కోళ్లకు దాణాగా వేసే సోయాబీన్, మొక్కజొన్నల మద్దతు ధర పడిపోయింది. (‘కోవిడ్’.. చికెన్‌తో నో డేంజర్!)
కరోనా వైరస్:
చాలామంది సెలబ్రిటీలకు కరోనా సోకినట్లు అసత్య ప్రచారాలు జరిగాయి. దీంతో తాము క్షేమంగానే ఉన్నట్లు పేర్కొంటూ వాళ్లే స్వయంగా సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు. తక్కువగా నమోదైన కేసుల సంఖ్యను ఎక్కువగా చూపిస్తూ ప్రజలను భయపెట్టారు. అప్పట్లో ఓ ప్రకటన అన్ని కంపెనీలకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నట్లు పేర్కొంది. అప్పుడు అది అబద్ధమే అయినప్పటికీ ఇప్పుడు చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అవకాశాన్ని కల్పించాయి. కరోనా వ్యాప్తి నివారణ కోసం తెలంగాణ రాష్ట్రంలోకి ఆర్మీ అడుగుపెట్టిందని మరో పుకారు. (తెలంగాణ ‘హాట్‌స్పాట్’!)
పెంపుడు జంతువుల ద్వారా వ్యాప్తి చెందుతుందనగానే వాటిని నిర్దాక్షిణ్యంగా రోడ్డున పడేయడం, 5జీ ద్వారా వ్యాప్తి చెందుతుందనగానే విదేశాల్లో వాటి టవర్లను ధ్వంసం చేయడం జరిగింది. పది సెకన్ల వరకు శ్వాసను బిగపట్టుకుంటే ఆ సమయంలో దగ్గు రాకపోతే వ్యాధి లేనట్లే అనేది మరో అర్థంపర్థం లేని వార్త. చైనా నుంచి వచ్చే పార్శిళ్లు, ప్యాకేజీ, లేఖల ద్వారా కరోనా వ్యాపిస్తుందన్నదానిలో నిజం లేదు. ఇలాంటి వస్తువులపై కరోనా ఎక్కువ గంటలు జీవించలేదు. (లాక్‌డౌన్: మృత్యువాత పడుతున్న మూగజీవాలు)
కరోనా నివారణ కోసం..
కరోనా కట్టడి కావాలంటే ముత్తైదువులు అమావాస్యలోపు ఏడు దారాలతో పసుపు కొమ్ములు కట్టుకుని అమావాస్య తర్వాత తీసివేయాలని చినజీయర్ స్వామి చెప్పినట్లు ప్రచారం వచ్చింది. కానీ ఇది ఉత్తిదేనని తేలింది. వేప చెట్టుకు 5 లేదా 7 బావుల నీళ్లు పోస్తే కరోనా రాదంటూ తలాతోకా లేని వార్త కూడా చక్కర్లు కొట్టింది. వెల్లుల్లి నీటిని తాగితే, ఎక్కువ సేపు ఎండలో నిలబడినా వైరస్‌ను నివారించవచ్చంటూ ఎన్నో ఆధారాలు లేని వార్తలు జనాలను మభ్యపెట్టాయి.
ఇప్పటివరకు ఎక్కువగా అసత్యాలు పుట్టుకొచ్చిన విభాగాలు
♦ కరోనా వైరస్
♦ చైనా
♦ లాక్‌డౌన్
♦ మతం
(బీబీసీ పేర్కొన్న గ్రాఫ్)
Comments
Please login to add a commentAdd a comment