న్యూఢిల్లీ: ఏదైనా విపత్తు సంభవించినా, మరేదైనా ఘటన జరిగినా సోషల్ మీడియాని ఫేక్ న్యూస్ ఉప్పెనలా ముంచేయడం సర్వసాధారణంగా మారిపోయింది. కరోనా సెకండ్ వేవ్ మొదలైన తర్వాత వ్యాక్సినేషన్ దగ్గర్నుంచి ప్లాస్మా డొనేషన్ వరకు ఎన్నో తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం మన్ కీ బాత్‌లో ఇలాంటి ప్రచారాలేవీ నమ్మవద్దని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో వాట్సాప్‌లో వైరల్‌గా మారిన ఏయే సందేశాలు తప్పుడివో కేంద్రం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫాక్ట్ చెక్ బృందం వివరణ ఇచ్చింది.
పీరియడ్స్‌లో టీకాపై..
మహిళలు పీరియడ్ రావడానికి అయిదు రోజుల ముందు, పీరియడ్ వచ్చిన అయిదు రోజుల తర్వాత వ్యాక్సిన్ తీసుకోకూడదు. రుతుస్రావం సమయంలో మహిళల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి టీకా తీసుకోవద్దు
కేంద్రం వివరణ
పీరియడ్ సమయంలో కూడా మహిళలు నిర్భయంగా వ్యాక్సిన్ తీసుకోవచ్చు. సహజసిద్ధంగా వచ్చే రుతుస్రావం వంటి శరీరంలో మార్పులు వ్యాక్సిన్‌కి అడ్డంకి కాదు.
ఇంటి చిట్కాలపై..
ఇంటివైద్యంతో కరోనా మటుమాయం. మిరియాలు, అల్లం, తేనె కలిపి రోజూ తీసుకుంటే కరోనా దరి చేరదు. దీనికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఒ) కూడా ఆమోద ముద్ర వేసింది.
కేంద్రం వివరణ
పాండిచ్చేరి యూనివర్సిటీ విద్యార్థి పేరు మీద సర్క్యులేట్ అయిన ఇది పూర్తిగా తప్పుడు సమాచారం. ఇంటి వైద్యాలతో కరోనాని కట్టడి చేయడం కుదిరే పని కాదు. డబ్ల్యూహెచ్‌ఒ కూడా ఎన్నడూ అలాంటి ప్రకటన చేయలేదు.
ఆవిరితో అడ్డుకట్టపై..
ప్రతీరోజూ ఆవిరి పడితే కరోనా సోకదు. ఈ వాట్సాప్ సందేశం బెంగుళూరులోని ఎయిర్ ఫోర్స్ కమాండ్ ఆస్పత్రిలో ఎయిర్ మార్షల్‌గా పని చేసే అశుతోష్ శర్మ పేరు మీద సర్క్యులేట్ అయింది.
కేంద్రం వివరణ
బెంగుళూరులో ఎయిర్ మార్షల్ అశుతోష్ శర్మ అని ఎవరూ లేరు. వైస్ ఎయిర్ మార్షల్‌గా పనిచేస్తున్న అశుతోశ్ శర్మ ఆధ్వర్యంలో బెంగుళూరు ఆస్పత్రి నడుస్తోంది. కానీ ఈ మెసేజ్ ఆయన సర్క్యులేట్ చేయలేదు. రోజూ ఆవిరి పడితే కరోనా సోకదని చెప్పడానికి శాస్త్రీయమైన ఆధారాల్లేవు. ఎవరికైనా కోవిడ్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి.
ప్లాస్మా దానంపై..
వ్యాక్సిన్ తీసుకుంటే కరోనా రోగులకి ప్లాస్మా ఇవ్వకూడదు.
కేంద్రం వివరణ
ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చింది. వ్యాక్సిన్ తీసుకున్న తేదీ నుంచి 28 రోజుల పాటు ప్లాస్మా ఇవ్వకూడదు. రక్తంలో యాంటీబాడీలు తగినంత స్థాయిలో లేకపోయినా సరే ప్లాస్మా ఇవ్వడం కుదరదు. గర్భవతులు కూడా ప్లాస్మా ఇవ్వలేరు. కరోనా వ్యాధి లక్షణాల్లేకుండా వస్తే 14 రోజుల తర్వాత, లేదంటే కరోనా నుంచి కోలుకున్న 14 రోజుల తర్వాతే ఎవరైనా ప్లాస్మా దానం చేయాలి.
చదవండి: వాళ్లకు కరోనా ముప్పు తక్కువే.. కానీ ఈ గ్రూప్ రక్తం ఉన్న వారికి!
Comments
Please login to add a commentAdd a comment