కూకట్‌పల్లిలో ఉండే శివకు కేబుల్ బిల్లు రూ.280 వచ్చింది. ‘మేం చూసేదే.. ఐదో, ఆరో చానళ్లు ఇంత ధరెందుకు? అంటే సార్ ఇది హైదరాబాద్.. ఇక్కడ అన్ని భాషలోళ్లు ఉంటరు.. మీ ఒక్కరికోసం తగ్గించలేం ’అని బదులిచ్చాడు కేబుల్ బాయ్. ఈ బాధ భరించలేక.. డీటీహెచ్ కొనుక్కున్నాడు. కానీ, అందులోనూ అదే దోపిడీ ఎంపిక చేసిన చానళ్ల పేరుతో ఖర్చు రూ.500లకు పెరిగింది.అందులోనూ తాను చూడని చానళ్లే అధికం. దీంతో దిక్కుతోచలేదు అతనికి.
సాక్షి, హైదరాబాద్: కేబుల్ టీవీ, డీటీహెచ్ పేరిట ఇష్టానుసారంగా జరుగుతున్న దోపిడీకి ఇది నిదర్శనం. నిబంధనల్ని తుంగలో తొక్కి అవసరం ఉన్నా లేకున్నా.. నచ్చని చానళ్లను అంటగడుతూ.. అందినకాడికి డబ్బులు దండుకుంటున్నారు. ఇక నుంచి ఇలాంటి వినియోగదారులపై వినోద భారం తగ్గనుంది. ఫిబ్రవరి 1 నుంచి ట్రాయ్ కొత్త నిబంధనలు అమలుకానున్నాయి. వాస్తవానికి ఇవి డిసెంబరు ఆఖరుకే అమలు కావాలి. కానీ, వివిధ వర్గాల ఆందోళనల నేపథ్యంలో అమలును ఫిబ్రవరి 1కి వాయిదా వేశారు. ట్రాయ్ కొత్త నిబంధనల ప్రకారం.. ఇష్టానుసారంగా చానళ్లకు రుసుం వసూళ్లు చేస్తామంటే కుదరదు. ఇష్టం లేని, చూడని చానళ్లకు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు.
ఎక్కువ వసూలు చేస్తున్నారు
వాస్తవానికి ట్రాయ్ నిబంధనల ప్రకారం.. కనిష్టంగా రూ.100 నుంచి గరిష్టంగా రూ.153 వసూలు చేయాలి. కానీ.. ఈ నిబంధనలు ఎక్కడా అమలు కావడం లేదు. ఎవరికి వారు ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నారు. తాము చూడని చానళ్లకు కూడా వారు డబ్బు చెల్లిస్తున్నారు. తెలంగాణలో దాదాపుగా 82 లక్షల మంది టీవీ సబ్‌స్క్రైబర్లున్నారు. వీరిలో 17 లక్షల మంది డీటీహెచ్ సబ్‌స్క్రైబర్లు. మీరు చూడని చానల్‌కు డబ్బులు చెల్లించనక్కర్లేదని ట్రాయ్‌చెబుతున్నా.. ఆ నిబంధనల్నికొన్ని శాటిలైట్ చానళ్లు పట్టించుకోవడం లేదు. వాస్తవానికి మదర్ చానల్ ఒకటి ఉంటుంది. దానికి అనుబంధంగా మరో డజను చానళ్ల వరకు ఉంటాయి. ఈ డజను చానళ్లలో ఏదో ఒకటే ఎంచుకుంటానంటే కుదరదు. ఏ ఒక్కటి చూడాలన్నా.. మొత్తం కొనుక్కోవాల్సిందే. వీటిపై ట్రాయ్ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
ప్రకటనల మాటేంటి?
వివిధ చానళ్లలో యాడ్ల ద్వారా ఆయా చానళ్లకు కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతోంది. వీటిలో ఉచిత చానళ్లలో యాడ్లపై వినియోగదారులకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. ఎటొచ్చీ పెయిడ్ చానళ్ల విషయంలో అభ్యంతరాలను లేవనెత్తుతున్నారు. ఇప్పటికే చానల్ చూస్తున్నందుకు డబ్బులిస్తున్నాం కదా? అలాంటప్పుడు మళ్లీ యాడ్ల గోల ఎందుకు? అని నిలదీస్తున్నారు. ట్రాయ్ కొత్త నిబంధనల నేపథ్యంలో ఒక్కో చానల్ ధరను 400% పెంచేశాయి. వీటి ద్వారానే కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతున్నపుడు తిరిగి ప్రకటనలు ప్రసారం చేయడం ఎందుకంటున్నారు.
వినియోగదారులకు హక్కులివి!
1. ఏ పే చానల్‌కు అయినా.. గరిష్ఠంగా 19 రూపాయలు మాత్రమే వసూలు చేయాలి. కొత్త నిబంధనల ప్రకారం 100 ఉచిత చానళ్లు తప్పనిసరిగా ఇవ్వాలి. అందులో 26 దూరదర్శన్ చానళ్లే ఉంటాయి. ఈ వంద చానళ్లకీ కలిపి 130 రూపాయలు, 18% జీఎస్టీ అంటే మొత్తం రూ.153.40 మాత్రమే చెల్లించాలి.
2. ఉచిత చానళ్ల ఎంపికలో పూర్తి స్వేచ్ఛ వినియోగదారుడిదే. వంద చానళ్ల కంటే ఎక్కువ ఉచిత చానళ్లను ఎంపిక చేసుకునే హక్కు కూడా వినియోగదారుడికి ఉంది. ఉదాహరణకు వందకు పైన ఇంకో 25 ఉచిత చానళ్లు కోరుకుంటే దానికి మరో 20 రూపాయలు ఎక్కువ బిల్లు కట్టాలి.
3. ప్రతీ చానల్ ధర వేర్వేరుగా ఉంటుంది. లేదంటే ఒకే గ్రూపునకు చెందిన చానళ్లు నాలుగైదింటికి కలిపి ఒక ధర ఇవ్వవచ్చు.
4. ప్రతీ ఆపరేటరూ తాను అందించే చానళ్ల లిస్టును వినియోగదారులకు వద్దకు తీసుకురావాలి. అందులో వినియోగదారులు నచ్చినవి ఎంపిక చేసుకుని, ఏది కావాలో టిక్ పెట్టి కింద సంతకం పెట్టాలి.
5. కేబుల్ యాక్టివేషన్ చార్జీలు 350 రూపాయలకు మించకూడదు. అన్నిటికీ బిల్లులు తప్పనిసరిగా ఇవ్వాలి. నెల నెలా కట్టే డబ్బులతో సహా.
6. మీకిచ్చే కార్డులో మొత్తం చానళ్ల పట్టిక, వాటి ధరలు, గ్రూపు చానళ్ల ధరలు, మీ ఎంపిక, నెలవారీ బిల్లు – మొత్తం ఉండాలి.
7. అన్ని రకాల నిబంధనలు ముద్రించిన కాగితం ఇవ్వాలి. అన్ని రకాల రేట్లు, రూల్స్ గురించి వివరించి చెప్పాలి. ఫిర్యాదు చేస్తే 8 గంటల్లో సర్వీసు సమస్య పరిష్కరించాలి.
8. ఏదైనా పే చానల్ ప్రసారాలు ఆగిపోతే ఆ డబ్బు వసూలు చేయకూడదు. కావాలంటే దాని బదులు అంతే ధర ఉన్న వేరే పే చానల్ ఇవ్వవచ్చు.
9. ఫిర్యాదులకు సంబంధించిన నంబర్లు ఇవ్వాలి, వెబ్ సైట్ ఏర్పాటు చేయాలి. చానళ్ల మార్పిడి రాతపూర్వకంగా ఉండాలి, 72 గంటల్లో జరగాలి.
10. నెల కంటే ఎక్కువ రోజులు చానల్ చూడకపోతే ఆ నెల బిల్లు కట్టక్కర్లేదు. కానీ ఆ విషయం 15 రోజుల ముందే ఆపరేటర్‌కి చెప్పాలి. కానీ రీ–కనెక్షన్‌కి 3 నెలల లోపు అయితే 25 రూపాయలు, మూడు నెలలు దాటితే 100 రూపాయలు కట్టాలి.
ప్రస్తుత తెలుగు చానళ్లు ఆఫర్ చేస్తోన్న ధరలు(రూ.ల్లో):
జెమినీ బొకే రూ.35.40,
ఈటీవీ బొకే రూ.28.32,
స్టార్ తెలుగు బొకే రూ.46.02,
జీ ప్రైమ్ ప్యాక్ బొకే రూ.23.60,
భవిష్యత్తులో అంతా ఆన్‌లైన్‌కే మొగ్గు!
ఇప్పటికే ఆన్‌లైన్‌లో అమేజాన్, నెట్‌ఫ్లిక్స్, జియో తదితర సంస్థలు యాడ్లు లేకుండా వినోదాన్ని అందించే ప్యాకేజీలు అందుబాటులో ఉంచాయి. ట్రాయ్ నిబంధనల ప్రకారం.. ప్రతీ ప్యాకేజీ భారంగా కనిపించే అవకాశాలున్న నేపథ్యంలో చాలామంది వీటివైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వీటిలో నచ్చిన కార్యక్రమం చూసుకోవచ్చు. పైగా మొబైల్‌కు, టీవీకి, కంప్యూటర్, ట్యాబ్ ఎక్కడైనా ఎపుడైనా చూసుకోవచ్చు. పైగా వీటి సబ్‌స్క్రిప్షన్ ఏడాదికి రూ.1000 లోపే కావడం గమనార్హం. ట్రాయ్ నిబంధనల్లో ప్రైవేటు ప్యాకేజీల భారంగా భావించినవారంతా వీటివైపు మొగ్గుచూపే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే ఎలాగూ.. న్యూస్ చానళ్లు ఉచితంగా వస్తున్నాయి. పలు టీవీ సీరియళ్లు యూట్యూబ్ ఇతర యాప్‌లో అందుబాటులో ఉంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment