
గార్డియన్‌గా కలెక్టర్ ఉండాలి: హిజ్రా వినతి
కలెక్టర్ తనకు గార్డియన్‌గా ఉండాలని కోరుతూ ఓ హిజ్రా సోమవారం వినతిపత్రం అందజేశారు.
కేకేనగర్: కలెక్టర్ తనకు గార్డియన్‌గా ఉండాలని కోరుతూ ఓ హిజ్రా సోమవారం వినతిపత్రం అందజేశారు. తమిళనాడులోని మదురైలో ‘భారతి కన్నమ్మ’ పేరిట ట్రస్ట్‌ను నిర్వహిస్తున్న హిజ్రా భారతి కన్నమ్మ (57) సోమవారం మదురై కలెక్టర్ కార్యాలయంలో ఒక వినతి పత్రం అందజేశారు. అందులో.. తనకు కలెక్టర్ గార్డియన్‌గా ఉండాలని కోరినట్టు తెలిపారు. ఈ సందర్భంగా భారతి కన్నమ్మ మాట్లాడుతూ.. తన తల్లిదండ్రులు పలు సంవత్సరాల క్రితమే మృతి చెందారనీ, తోబుట్టువులు ఎవరూ ఆదరణ చూపకపోవడంతో తాను ఒంటరిగా ఉంటూ సామాజిక సేవ చేస్తున్నానని తెలిపారు.
తాను ఇప్పటికే బీఏ పూర్తిచేశానని, ప్రస్తుతం ఎల్‌ఎల్‌బీలో చేరడానికి దరఖాస్తు చేసుకున్నట్టు చెప్పారు. అయితే ఈ దరఖాస్తులోని 14, 15 పట్టికల్లో తల్లిదండ్రులు లేదా గార్డియన్ వృత్తి, ఆదాయం తదితర వివరాలు చూపాలని ఇచ్చారన్నారు. అయితే తల్లిదండ్రులు కానీ, గార్డియన్ కానీ లేరా? అని ఏ పట్టికలోనూ పేర్కొనలేదనీ, కనుక తనకు గార్డియన్‌గా కలెక్టర్ కావాలని కోరుతున్నట్టు భారతి కన్నమ్మ వివరించారు.