
తృణమూల్‌కు సృంజయ్ బోస్ రాజీనామా
- బెయిల్‌పై విడుదలైన మర్నాడే.. ఎంపీ పదవికి రాజీనామా
కోల్‌కతా: శారదా కుంభకోణం అంశం తృణమూల్ కాంగ్రెస్‌ను ఇంకా అట్టుడికిస్తూనే ఉంది. సీబీఐ అరెస్టులు, ప్రశ్నల పర్వానికితోడు పార్టీ నేతల రాజీనామాలతో దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే పలువురు నేతలు టీఎంసీకి టాటా చెప్పగా... తాజాగా శారదా స్కాంలో జైలుకు వెళ్లి, బెయిల్‌పై బయటకు వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు సృంజయ్ బోస్ ఆ పార్టీకి, ఎంపీ పదవికి గురువారం రాజీనామా చేశారు.
పశ్చిమబెంగాల్‌ను కుదిపేసిన శారదా చిట్‌ఫండ్ కుంభకోణం కేసులో ఆ పార్టీ ఎంపీ సృంజయ్‌బోస్ 75 రోజులుగా జైల్లో ఉండి బుధవారం బెయిల్‌పై విడుదలయ్యారు.. గురువారం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ‘‘రాజకీయాలు నా చేతిలో టీ కాదని ఇన్ని రోజులుగా జైల్లో ఉన్న సమయంలో నాకు అర్థమైంది. నా కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు రాజీనామా చేస్తున్నా’ అని పేర్కొన్నారు. కాగా..కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నుంచి బోస్‌పై విపరీతమైన ఒత్తిడి ఉందని టీఎంసీనేత ఓబ్రియాన్ వ్యాఖ్యానించారు. కాగా, పశ్చిమ బెంగాల్ మహిళా కమిషన్ సభ్యురాలు, సినీ నటి లోకేత్ చటర్జీ గురువారం తృణమూల్ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి.. బీజేపీలో చేరారు.
‘శారదా’పై పర్యవేక్షణకు సుప్రీం నో!: మరోవైపు శారదా చిట్‌ఫండ్ కుంభకోణంపై సీబీఐ చేస్తున్న దర్యాప్తును ప్రత్యక్షంగా పర్యవేక్షించాలన్న పశ్చిమబెంగాల్ ప్రభుత్వ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు గురువారం తోసిపుచ్చింది. దీనికి సంబంధించి సీబీఐ ఎలాంటి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నట్లుగానీ బెంగాల్ ప్రభుత్వం పేర్కొనలేదని జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ సి.నాగప్పన్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.