
మోదీ రథాన్ని ఆపలేరు
మోదీ రథాన్ని ఆపే శక్తి తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కు లేదని.. బెంగాల్‌లో ‘కమలం వికసిస్తుంది’అని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు.
తృణమూల్‌పై బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా
సిలిగురి (పశ్చిమ బెంగాల్): మోదీ రథాన్ని ఆపే శక్తి తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కు లేదని.. బెంగాల్‌లో ‘కమలం వికసిస్తుంది’అని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం బెంగాల్‌కు వచ్చిన షా నక్సల్బరీలో స్థానిక కార్యకర్తలు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ‘తృణమూల్ కాంగ్రెస్ మోదీజీ రథాన్ని ఆపగలనని అనుకుంటోంది, కానీ అది దాని తరం కాదు. ఇక్కడ ఎంత ఎక్కువగా మమ్మల్ని ఆపాలని ప్రయత్నిస్తే కమలం అంతలా వికసిస్తుంది.
2019 లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి అత్యధిక సీట్లు వస్తాయి. ఇందుకు దేశ ప్రజలే సాక్ష్యం’అని షా అన్నారు. ఒకప్పుడు అభివృద్ధిలో ముందుండే బెంగాల్ ఇప్పుడు వెనకబడిందని, నిరుద్యోగం ప్రబలిందని షా పేర్కొన్నారు. తృణమూల్ ప్రభుత్వం మైనారిటీలను బుజ్జగిస్తోందని ఆయన ఆరోపించారు. మోదీ ‘సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్’నినాదాన్ని పేర్కొంటూ అభివృద్ధి దేశం నలుమూలలకూ చేరుతుందన్నారు.
నక్సల్బరీ నుంచే అభివృద్ధి ప్రారంభం
‘నక్సలైట్లు హింసాత్మక కార్యక్రమాలు నక్సల్బరీ నుంచే ప్రారంభించారు. కానీ ప్రస్తుతం అభివృద్ధి, వికాసం ఇక్కడి నుంచే ప్రారంభమవుతాయి. మోదీ నేతృత్వంలో బెంగాల్ త్వరలో అభివృద్ధి బాటలో నడు స్తుంది’ అని అమిత్ షా అన్నారు. 2019 ఎన్నికలను లక్ష్యంగా చేసుకున్న అమిత్ షా 15 రోజుల్లో 5 రాష్ట్రాల్లో పర్యటించి ఆయా రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయను న్నారు. దీనిలోభాగంగా అమిత్‌షా ఒడిశా, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో వరసగా కార్యకర్తలతో భేటీ అయి, పార్టీని పటిష్టతకు వ్యూహ రచన చేయనున్నారు.