తృణమూల్ ఎంపీ అరెస్ట్
కోల్‌కతా: రోజ్ వ్యాలీ చిట్ ఫండ్ స్కాంలో తృణ మూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ తపస్ పాల్‌ను శుక్రవారం సీబీఐ అరెస్టు చేసింది. పశ్చిమ బెంగాల్ లో చిట్‌ఫండ్ స్కాంలను విచారణ చేస్తున్న సీబీఐ రోజ్ వ్యాలీ స్కామ్‌పై ఈ నెల 27న పాల్‌కు సమన్లు జారీ చేసింది. సాల్ట్ లేక్‌లోని తమ కార్యాలయానికి శుక్రవారం హాజరుకావాలని ఆదేశించిన సీబీఐ విచారణ కోసం ఆయన్ను అదుపులోకి తీసుకుంది. తామడిగిన ఏ ప్రశ్నకూ ఎంపీ తపస్ సరైన సమాధానాలు ఇవ్వలేదని సీబీఐ అధికారి తెలిపారు. రోజ్ వ్యాలీ కంపెనీల్లోని ఒక దానికి డైరెక్టర్‌గా నియామకం కావడం, బెంగాలీ సినీ పరిశ్రమలో పెట్టుబడులు వంటి అంశాలపై అడిగిన ప్రశ్నలకు ఆయన సరైన సమాధానం ఇవ్వలేదని అన్నారు. విచారణకు ఎంపీని భువనేశ్వర్‌కు తీసుకెళ్తున్నామన్నారు.
నన్ను, మా ఎంపీలందర్నీ అరెస్టు చేయండి: మమత
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తనను, తన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలందర్నీ అరెస్టు చేయాలని సీఎం మమతా బెనర్జీ సవాల్ విసిరారు. తమ పార్టీ ఎంపీలందరినీ అరెస్టు చేసినా బెదరబోనన్నారు. నోట్ల రద్దును వ్యతిరేకించినందుకు తమ పార్టీ, నేతలపై కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ‘రాజకీయ దురాగతాల’కు పాల్పడుతోందని ఆ పార్టీ ప్రతినిధి డెరెక్ ఓబ్రియాన్ ఆరోపించారు.