త్రిపుర సీఎం ప్రసంగానికి దూరదర్శన్ నో!
అగర్తలా: దూరదర్శన్, ఆలిండియా రేడియో తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగాన్ని ప్రసారం చేయడానికి నిరాకరించాయని త్రిపుర సీఎం మాణిక్ సర్కార్ ఆరోపించారు. ప్రసంగ పాఠంలో మార్పులు చేస్తేనే ప్రసారం చేస్తామని అవి చెప్పటం అప్రజాస్వామిక, నిరంకుశ, అసహన చర్య అని అభివర్ణించారు.
త్రిపుర ప్రభుత్వం మంగళవారం జారీచేసిన ప్రకటన ప్రకారం...డీడీ, ఆకాశవాణి ఆగస్టు 12నే సర్కార్ ప్రసంగాన్ని రికార్డు చేశాయి. అయితే అందులో మార్పులు చేస్తేనే ప్రసారం చేస్తామంటూ సోమవారం సీఎం కార్యాలయానికి లేఖ వచ్చింది.‘సీఎం ప్రసంగాన్ని అధికారులు పరిశీలించారు. ప్రస్తుత రూపంలో దాన్ని ప్రసారం చేయలేం. ప్రజల సెంటిమెంట్లు, సందర్భోచితంగా సీఎం తన సందేశంలో మార్పులు చేస్తే మంచిది’ అని పేర్కొన్నారు. అయితే తన ప్రసం గంలో అక్షరం కూడా మార్చడానికి సీఎం ఒప్పుకోలేదని ఆయన కార్యాలయం చెప్పింది.