
అగర్తలా: దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్నార్సీ), జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్)పై నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో త్రిపుర రాష్ట్రం తాజాగా జాతీయ జనాభా పట్టిక(ఎన్‌పీఆర్)పై కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ జనాభా పట్టికకు సంబంధించిన వివరాలను ఒక ప్రత్యేకమైన మొబైల్ యాప్ ద్వారా సేకరిస్తామని త్రిపుర రాష్ట్ర జనాభా లెక్కల కార్యకలాపాల డైరెక్టరేట్ పీకే చక్రవర్తి శుక్రవారం తెలిపారు. ఎన్‌పీఆర్ డేటాను సేకరించటం కోసం 11 వేల మంది అధికారులను తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. ఇక మొదటి దశలో రాష్ట్రంలో ఉన్న ఇళ్ల జాబితాను తయారు చేసి.. గృహ గణన చేపడతామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమం మే 16 నుంచి అధికారికంగా ప్రారంభమవుతుందని ఆయన పేర్కొన్నారు. (మాజీ సీఎం సిద్ధరామయ్య అరెస్ట్)
కాగా మొదటిదశ ఎన్‌పీర్ డేటా సేకరణ ఈ ఏడాది జూన్ 29 వరకు కొనసాగుతుందని పీకే చక్రవర్తి తెలిపారు. అదే విధంగా రెండో దశ ఎన్‌పీఆర్ డేటా సేకరణ కార్యక్రమం వచ్చే ఏడాది ప్రారంభమవుతుందన్నారు. ఈ ఎన్‌పీఆర్ డేటా సేకరణ ప్రక్రియ పూర్తిగా మొబైల్ యాప్ ద్వారా మాత్రమే జరుగుతుందని ఆయన తెలిపారు. డేటా సేకరణ కార్యక్రమంలో పాల్గొననున్న 11 వేల మంది అధికారుల్లో దాదాపు 9062 మంది జనాభా లెక్కల అధికారులు, 1556 మంది సూపర్‌వైజర్లు, తొమ్మిది మంది ప్రిన్సిపల్ సెన్సస్ అధికారులు ఉన్నారని ఆయన చెప్పారు. పదహారు మాస్టర్ ట్రైనర్లు ఏప్రిల్ 6 నుంచి 10 వరకు 169 మంది ఫీల్డ్ ట్రైనీలకు త్రిపుర రాజధాని అగర్తలలో శిక్షణ ఇస్తారని పీకే చక్రవర్తి తెలిపారు.
(డేటింగ్‌లకూ రాజకీయ చిచ్చు)