ములాయం ఇంటి రామాయణం!
సాక్షి, సెంట్రల్ డెస్క్ : అనగనగా ఒక రాజు.. ఆయనకు ముగ్గురు భార్యలు.. నలుగురు కుమారులు.. ముగ్గురు భార్యల్లో ఒకరికి తన కొడుకంటేనే ఇష్టం.. సింహాసనంపై తన బిడ్డనే కూర్చోబెట్టాలన్నది ఆమె ఆశ.. అందుకు కుయుక్తులు పన్నుతుంది.. భర్తను వరం కోరుకొని సింహాసనం అధిష్టించాల్సిన తన సోదరి కుమారుడిని కానలకు పంపుతుంది.. తన కొడుకుకు రాజ్యం దక్కేలా చేస్తుంది! ఇది రామాయణం అని అందరికీ అర్థమవుతుంది! ఇప్పుడు యూపీలోనూ ఇంచుమించు ఇలాంటి కథే నడుస్తోంది! దశరథుడి పాత్రలో ఎస్పీ చీఫ్ ములాయం .. తన కొడుకు అఖిలేశ్, రెండో భార్య సాధనా గుప్తా మధ్య నలిగిపోతున్నాడు.
రామాయణంలో కైకేయి పాత్రను పోషిస్తూ సాధన తన కొడుకు భార్య (కోడలు)కు పట్టం కట్టాలని చూస్తోందంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే నాడు తండ్రి మాట జవదాటని రాముడి మాదిరి కాకుండా అఖిలేశ్ దూకుడుగా వ్యవహరిస్తున్నాడని, తండ్రి, పినతల్లి మద్దతుదారులపై యుద్ధం ప్రకటించాడని అంటున్నారు. పీఠం కోసం ములాయం కుటుంబంలో సాగుతున్న ఈ కలహాలే యూపీలో సంక్షోభానికి దారి తీశాయని చెబుతున్నారు.
ఎవరీ సాధన? 2003 వరకు ఈమె గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. ఆ ఏడాది ములాయం తొలి భార్య మాలతి(అఖిలేశ్ తల్లి) చనిపోవడంతో ఈమె తెరపైకి వచ్చింది. ములాయం రెండో భార్యగా జనానికి పరిచయమైంది. లక్నోలోని ములాయం ఇంట్లోకి చేరింది. ములాయంతో ఈమె పెళ్లి ఎప్పుడు జరిగిందో తెలియదుకానీ వీరిరువురికి 1988లోనే కొడుకు పుట్టాడు. పేరు ప్రతీక్. ఈయనకు రాజకీయాలపై ఆసక్తి లేదు. కానీ ప్రతీక్ భార్య అపర్ణ రాజకీయ భవిష్యత్తు కోసమే సాధన ఇదంతా నడుపుతోందని రాజకీయ పరిశీలకులంటున్నారు. పార్టీలో అఖిలేశ్‌కు చెక్‌పెట్టి, కీలకంగా మారాలన్నది ఈమె వ్యూహంగా చెబుతున్నారు. అందుకే అఖిలేశ్‌కు ఇష్టం లేకపోయినా, ములాయం వద్దన్నా అమర్‌ను మళ్లీ పార్టీలోకి తీసుకొచ్చిందని సమాచారం.సాధనకు రాజకీయ సలహాలు ఇస్తోంది అమర్‌సింగే కావడం గమనార్హం.
అఖిలేశ్ అంటే ఎందుకు వ్యతిరేకత?
తన కోడ లి పొలిటికల్ కెరీర్ కోసం 2012 నుంచే సాధన ప్రణాళికలు వేస్తున్నట్టు పరిశీలకులు చెబుతున్నారు. ఆ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక అఖిలేశ్ సీఎం కాకుండా చూసేందుకు సాధన తెరవెనుక ప్రయత్నాలు సాగించింది. పార్టీ నేతలందరినీ తన గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు యత్నించిందంటూ ఆమెపై ఆరోపణలున్నాయి. నాడు అఖిలేశ్‌ను అడ్డుకోవడం సాధ్యం కాకపోవడంతో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ములాయం సోదరుడు శివపాల్‌తో కలిసి అఖిలేశ్‌కు చెక్ పెట్టాలని చూస్తున్నట్లు సమాచారం. ఎన్నికల తర్వాత తదుపరి సీఎంను ఎమ్మెల్యేలే నిర్ణయిస్తారంటూ ఇటీవల ములాయం అనడం గమనార్హం.
అఖిలేశ్ ‘సర్జికల్ స్ట్రయిక్స్’ తన పీఠానికి ఎసరు తెస్తున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్న అఖిలేశ్ ఇక ఊరుకుంటే పరిస్థితి చేయి దాటిపోతుందని భావిస్తున్నారు. అందుకే దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఒకవేళ పార్టీ చీలిపోయినా మెజారిటీ నేతలు తనవైపే ఉంటారని భావిస్తున్నారు. ప్రజల్లో తనపట్ల ఉన్న ‘క్లీన్‌ఇమేజ్’ ఎన్నికల్లో లాభిస్తుందని గట్టిగా నమ్ముతున్నారు. అందుకే తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధపడ్డారు. సాధనకు, శివలాల్‌కు మద్దతుదారులుగా ఉన్న ముగ్గురు మంత్రులపై వేటు వేశారు. ఆ మరుసటి రోజే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దీపక్ సింఘాల్‌ను తొలగించారు. తన చిన్నాన్న శివపాల్‌ను ఒకేనెలలో రెండుసార్లు కేబినెట్ నుంచి తొలగించారు.
అపర్ణ పరిస్థితి ఏంటి? తన కోడలు అపర్ణను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో లక్నో కంటోన్మెంట్ స్థానం నుంచి పోటీ చేయించాలని సాధనా గుప్తా భావిస్తున్నారు. ఈ సీటును ఇప్పటికే ఆమెకు అట్టిపెట్టినట్టు పార్టీ వర్గాల సమాచారం. అయితే కొద్దిరోజుల కిందట కాంగ్రెస్‌కు షాక్ ఇస్తూ బీజేపీలో చేరిన రీటా బహుగుణ సైతం ఇక్కడ్నుంచే పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో సాధన పునరాలోచనలో పడ్డట్టు సమాచారం.