లక్నో: సుశిక్షితుడైన మల్లయోధుడు. రాజకీయాల్లో కాకలుతీరిన వ్యూహకర్త. హిందుత్వ వ్యతిరేక రాజకీయాలకు చిరకాలం పాటు కేంద్ర బిందువు. జాతీయ స్థాయిలో విపక్ష రాజకీయాల్లో కీలక పాత్రధారి. ఇలా బహుముఖీన వ్యక్తిత్వం ములాయంసింగ్ యాదవ్ సొంతం. ఓ సాధారణ రైతు బిడ్డగా మొదలైన ఆయన ప్రస్థానం ప్రధాని పదవికి పోటీదారుగా నిలిచేదాకా సాగింది. దశాబ్దాల పాటు దేశ రాజకీయాల్లో ప్రముఖ నేతగా వెలుగొందినా, ఈ రాజకీయ మల్లునికి యూపీయే ప్రధాన రాజకీయ వేదికగా నిలిచింది.
సోషలిస్టుగానే కొనసాగినా రాజకీయాల్లో ఎదిగేందుకు అందివచ్చిన అవకాశాలను రెండు చేతులా అందిపుచ్చుకోవడంలో ములాయం ఏనాడూ వెనకాడలేదు. యూపీలో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రధాన ప్రత్యర్థి అయిన బీఎస్పీతో పాటు కాంగ్రెస్‌తోనూ పొత్తుకు సై అన్నారు! రాజకీయంగా గాలి ఎటు వీస్తోందో గమనిస్తూ తదనుగుణంగా వైఖరి మార్చుకుంటూ వచ్చారు. తొలినాళ్లలో లోహియాకు చెందిన సంయుక్త సోషలిస్టు పార్టీ, చరణ్‌సింగ్ భారతీయ క్రాంతిదళ్, భారతీయ లోక్‌దళ్, సమాజ్‌వాదీ జనతా పార్టీ తదితరాల్లో కొనసాగినా, 1992లో సమాజ్‌వాదీ పార్టీని స్థాపించినా ఈ సూత్రాన్నే అనుసరించారు.
లోహియా అనుయాయి...
ములాయం టీనేజీ దశలోనే సోషలిస్టు దిగ్గజం రాం మనోహర్ లోహియా సిద్ధాంతాల పట్ల ఆకర్షితులయ్యారు. విద్యార్థి ఉద్యమాల్లో ముమ్మరంగా పాల్గొన్నారు. పొలిటికల్ సైన్స్‌లో పట్టభద్రుడై కొంతకాలం అధ్యాపకునిగా పని చేశారు. 1967లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. రెండోసారి ఎమ్మెల్యేగా ఉండగా ఎమర్జెన్సీ సమయంలో జైలు జీవితం గడిపారు. అనంతరం లోక్‌దళ్ యూపీ విభాగానికి అధ్యక్షుడయ్యారు. పార్టీలో చీలిక నేపథ్యంలో చీలిక వర్గానికి రాష్ట్ర చీఫ్‌గా కొనసాగారు. యూపీ అసెంబ్లీలో, మండలిలో విపక్ష నేతగా పని చేశారు. బీజేపీ బయటినుంచి మద్దతుతో జనతాదళ్ నేతగా 1989లో తొలిసారిగా యూపీ సీఎం పదవి చేపట్టారు.
1993లో బీఎస్పీ మద్దతుతో మరోసారి సీఎం అయినా కొంతకాలానికి ఆ పార్టీ మద్దతు ఉపసంహరిచడంతో ములాయం సర్కారు కుప్పకూలింది. అనంతరం ఆయన జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు. మెయిన్‌పురి నుంచి 1996లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. యునైటెడ్ ఫ్రంట్ పేరుతో కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటుకు విపక్షాలు ప్రయత్నించిన సమయంలో ప్రధాని అభ్యర్థిగా ఆయన పేరు ప్రముఖంగా తెరపైకి వచ్చింది. చివరికి హెచ్‌డీ దేవెగౌడ ప్రధాని కాగా ఆయన ప్రభుత్వంలో ములాయం రక్షణ మంత్రిగా పని చేశారు.
వివాదాలూ మరకలూ...
మలినాళ్ల ప్రస్థానంలో ములాయం ఎన్నో ఎగుడుదిగుళ్లు చవిచూశారు. పలు వివాదాస్పద వ్యాఖ్యలతో విమర్శలూ మూటగట్టుకున్నారు. యూపీలో సమాజ్‌వాదీ పార్టీకి బీజేపీయే ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న నేపథ్యంలో 2019లో ఏకంగా పార్లమెంటులోనే ప్రధాని మోదీపై పొగడ్తలు కురిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. మోదీ తిరిగి అధికారంలోకి రావాలంటూ ఆకాంక్షించిన తీరు విశ్లేషకులను కూడా విస్మయపరిచింది. రేప్ కేసుల్లో మరణశిక్షలను వ్యతిరేకించే క్రమంలో ‘అబ్బాయిలన్నాక తప్పులు చేయడం సహజం’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలపాలయ్యారు. కుటుంబ పోరు ముదిరి 2017లో అఖిలేశ్ పార్టీ పగ్గాలు చేపట్టినా అభిమానుల దృష్టిలో చివరిదాకా ‘నేతాజీ’గానే ములాయం నిలిచిపోయారు!
సోనియా ‘ప్రధాని’ ఆశలకు గండికొట్టారు
1999లో వాజ్‌పేయీ ప్రభుత్వ పతనానంతరం సోనియా ప్రధాని కాకుండా అడ్డుకోవడంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో కలిసి ములాయం ప్రధాన పాత్ర పోషించారు. అప్పటికి ఆమె కాంగ్రెస్ అధ్యక్షురాలి హోదాలో రాష్ట్రపతి కె.ఆర్.నారాయణన్‌ను కలిసొచ్చి జోరు మీదున్నారు. మెజారిటీకి అవసరమైన 272 మంది ఎంపీలు తమవద్ద ఉన్నారని, ప్రభుత్వ ఏర్పాటు లాంఛనమేనని మీడియా సాక్షిగా ప్రకటించారు. కానీ 20 మంది ఎంపీల బలమున్న ములాయం మాత్రం సోనియా ప్రధాని అవడాన్ని ఇష్టపడలేదు. సీపీఎం దిగ్గజం జ్యోతిబసు పేరును ప్రతిపాదించి ఆమె ఆశలపై నీళ్లు చల్లారు.
అసెంబ్లీకి బాటలు వేసిన ‘కుస్తీ’!
స్వయంగా మల్లయోధుడైన ములాయంకు కుస్తీ పోటీలంటే ఎంతో మక్కువ. మల్లయోధులుగా తర్ఫీదు పొందే యువకులను ఎంతగానో ప్రోత్సహించేవారు. కుస్తీ ప్రావీణ్యమే ములాయంకు తొలిసారి ఎమ్మెల్యే టికెట్ తెచ్చిపెట్టడం విశేషం. జస్వంత్‌నగర్ సిట్టింగ్ ఎమ్మెల్యే, సోషలిస్ట్ పార్టీ నేత నాథూసింగ్ ఒకసారి ములాయంతో కుస్తీకి దిగారు. ఆయన తనతో తలపడ్డ తీరుకు నాథూసింగ్ ఎంతగానో ముచ్చటపడ్డారు. 1967 ఎన్నికల్లో తనకు బదులుగా జస్వంత్‌నగర్ నుంచి సోషలిస్టు పార్టీ తరఫున బరిలో దిగాల్సిందిగా కోరారు. అందుకు ములాయం సరేననడం, ఎన్నికల్లో గెలిచి మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టడం చకచకా జరిగిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment