యూపీలో రాజకీయ సినిమా..! | The political film in UP! | Sakshi
Sakshi News home page

యూపీలో రాజకీయ సినిమా..!

Published Thu, Feb 16 2017 2:11 AM | Last Updated on Fri, Mar 29 2019 9:04 PM

యూపీలో రాజకీయ సినిమా..! - Sakshi

యూపీలో రాజకీయ సినిమా..!

ముందు శత్రుత్వం.. విరామం తర్వాత స్నేహం
కాంగ్రెస్‌–ఎస్‌పీ పొత్తుపై ప్రధాని మోదీ వ్యంగ్యాస్త్రాలు
కాంగ్రెస్‌ జనాలు ఎలాంటి వారో అఖిలేశ్‌కు తెలీదు
ములాయంపై హత్యాయత్నం సంగతి గుర్తుతెచ్చుకోవాలని సూచన


కన్నౌజ్‌: ‘‘ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ వేదికగా ఓ సినిమా నడుస్తోంది. ఈ సినిమాలో ఇద్దరు ప్రత్యర్థులు ఉన్నారు. ‘27 ఏళ్లుగా యూపీ వెనుకబడింది’అంటూ ఒకరు.. యాత్రల పేరుతో మరొకరు.. సినిమా మొదటి సగభాగాన్ని రక్తికట్టించారు. ఒకరిపై మరొకరు విమర్శలు, ఆరోపణలు చేసుకున్నారు. ఇంటర్వెల్‌(విరామం) తర్వాత ఈ ప్రత్యర్థులు మిత్రులుగా మారిపోయారు. ఎన్నికల ప్రకటన వచ్చేసరికి ఒకరిపై మరొకరు ప్రేమ ఒలకబోసుకుంటూ కూటమిగా జనం ముందుకు వచ్చారు’’ అని కాంగ్రెస్‌–సమాజ్‌వాదీ పార్టీ పొత్తును తప్పుపడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా యూపీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్, కాంగ్రెస్‌ పార్టీలపై విమర్శలు గుప్పించారు. మోసపూరిత కాంగ్రెస్‌ జనాల వైఖరి ఎలా ఉంటుందో అఖిలేశ్‌కు తెలియదని, అందుకే ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నారని చెప్పారు. 1984లో ములాయంసింగ్‌యాదవ్‌పై జరిగిన హత్యాయత్నం గురించి ఒకసారి ఆలోచించాలని గుర్తుచేశారు. అప్పుట్లో ఓ కాంగ్రెస్‌ నాయకుడు ములాయంపై చేసిన హత్యాయత్నాన్ని మరచిపోయావా అని ప్రశ్నించారు. అఖిలేశ్‌కు అనుభవం తక్కువని, అందుకే కాంగ్రెస్‌ మోసపూరిత వైఖరి ఎలా ఉంటుందో అతనికి తెలియదని, కానీ ములాయంకు కాంగ్రెస్‌ వైఖరి ఎలాంటిదో తెలుసని అందుకే ఆ పార్టీకి దూరంగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్‌–ఎస్‌పీ పొత్తు మీ కలలను కల్లలు చేస్తుందని ఓటర్లను మోదీ హెచ్చరించారు.

కాంగ్రెస్‌ పార్టీ ఎస్‌పీతో పొత్తు పెట్టుకునే.. మరోవైపు బీఎస్‌పీతోనూ సంబంధాలు కొనసాగిస్తోందని మోదీ ఆరోపించారు. కాంగ్రెస్‌–ఎస్‌పీ కూటమి ఏర్పాటైన తర్వాత నిర్వహించిన విలేకరుల సమావేశంలో అఖిలేశ్‌ మాయావతిపై విమర్శలు చేస్తే.. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు ఆమె గురించి మాట్లాడేందుకు నిరాకరించారని గుర్తుచేశారు. యూపీ ఎందు లో ముందుంది అని చెప్పాలంటే.. అవినీతి, అల్లర్లు, మహిళలపై ఆకృత్యాలు, నిరుద్యోగం, పేదరికం, వలసలు వీటిలోనే అని చెప్పారు. రైతుల సంక్షేమం కోసం కేంద్రప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని, కనీస మద్దతుధర, చిన్న రైతులకు రుణాలు మాఫీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.

రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీగా.. యూపీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయగానే.. తొలి సమావేశంలోనే రుణాల మాఫీ హామీని నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు. పెద్ద నోట్ల రద్దుకు సంబంధించి ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని, దీనికి సంబంధించి తనపై అన్ని రకాల ఆరోపణలు చేస్తున్నాయని చెప్పారు. అయితే దేశప్రజలు చాలా ఆలోచనాపరులని, ఇలాంటి అబద్ధపు ప్రచారం వారిపై పనిచేయదని చెప్పారు.

మోదీ నివాళి
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌లో మంగళవారం ఉగ్రవాదులతో పోరు సందర్భంగా అమరులైన నలుగురు ఆర్మీ సిబ్బందికి ప్రధాని మోదీ బుధవారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. అమరులైన సైనికుల్లో మేజర్‌ ఎస్‌.దహియా కూడా ఉండటం తెలిసిందే. సైనికుల భౌతికకాయాలను శ్రీనగర్‌ నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి తరలించారు. ‘ఉగ్రవాదులతో పోరాడుతూ ప్రాణాలను త్యాగం చేసిన వీరులకు నివాళులర్పించాను. వారి త్యాగాన్ని, శౌర్యాన్ని భారత్‌ ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది’ అని మోదీ ట్వీట్‌ చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement