
గుజరాత్‌లో రూ. 5 కోట్ల విలువైన సొమ్ము దోపిడీ
అహ్మదాబాద్: గుజరాత్‌లో జాతీయ రహదారిపై భారీ దోపిడీ జరిగింది. దాదాపు రూ. 5 కోట్ల విలువైన బంగారం, వెండిని దుండగులు దోచుకున్నారు. ఈ ఘటన అహ్మదాబాద్‌కు చేరువలోని భాల్యా గ్రామం వద్ద చోటుచేసుకుంది. రూ. 5 కోట్ల విలువైన సొత్తును ఒక ట్రక్‌లో అహ్మదాబాద్ నుంచి రాజ్‌కోట్‌కు తరలిస్తుండగా దాదాపు ఐదు మంది దుండగులు ట్రక్‌ను అడ్డగించారు. ట్రక్‌లోని 25 సొమ్ముతో కూడిన బాక్సులను కారులోకి తరలించి పోలీసులు రాకముందే పారిపోయారు.
అంతకు ముందే ట్రక్‌కు జీపీఎస్‌ను ఏర్పాటు చేసిన యజమాని ఈశ్వర్ బేచర్ అంగాడియా ట్రక్ నిర్మానుష్య ప్రదేశంలో ఆగి ఉండడం గమనించి డ్రైవర్‌కు ఫోన్ చేయగా స్పందించలేదు. వెంటనే ఆయన స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరేసరికే దుండగులు అక్కడి నుంచి సొమ్ముతో ఉడాయించారు. ఆ సొత్తు విలువ రూ. 5 కోట్లని అహ్మదాబాద్ గ్రామీణ పోలీస్ నిర్లిప్త్ రాయ్ తెలిపారు.