
ఒడిషాలో రెండు రైళ్లు ఢీ: ఇద్దరు మృతి
రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో ఇద్దరు ప్రయాణికులు మృతిచెందగా, 17 మంది గాయపడ్డారు.
భువనేశ్వర్: రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందగా, 17 మందికి తీవ్రగాయాలయినట్టు తెలుస్తోంది. ఈ ఘటన ఒడిషాలోని కటక్లో కాథోజోడీ రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం చోటుచేసుకుంది. భువనేశ్వర్-భద్రాక్ ప్యాసెంజర్ రైలు వెనక నుంచి గూడ్స్ రైలును ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. అయితే ఈ ప్రమాదంలో ఎంతమంది గాయపడ్డారో రైల్వే అధికారులు ఇంతవరకూ అధికారికంగా ప్రకటించలేదు.
సమాచారం అందుకున్న రిస్య్కూం టీం, పోలీసులు అధికారులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్టు తెలిసింది. ఇదిలా ఉండగా, రాంగ్ సిగ్నల్ సూచించడం వల్లే రెండు రైళ్లు ఒకే ట్రాక్‌పై రావడంతో ఈ ప్రమాదానికి దారితీసిందని ఓ నివేదిక వెల్లడించింది. ఈ ఘటన నేపథ్యంలో భువనేశ్వర్ కటక్ ల మధ్య రైల్వే మార్గాల్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనకు గల కారణాలపై విచారించేందుకు ఈస్ట్ కోస్ట్ రైల్వే (ఈకోఆర్) ఓ కమిటీని ఏర్పాటు చేసినట్టు రైల్వే అధికారులు వెల్లడించారు.