చెన్నై: ఐఎస్ తీవ్రవాద ముఠాలో చేరేందుకు తమిళనాడుకు చెందిన ఇద్దరు యువకులు టూరిస్ట్‌వీసా ముసుగులో బయలుదేరి కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులకు పట్టుబడడం రాష్ట్రంలో కలకలం రేపింది. చెన్నై రాయపేటకు చెందిన 23 ఏళ్ల బీకాం పట్టభద్రుడు, కరూరు జిల్లాలో పాఠశాల విద్యను మధ్యలోనే వదిలేసిన మరో 22 ఏళ్ల యువకుడు ఐఎస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇంటర్నెట్ ద్వారా ఐఎస్ తీవ్రవాదులను ఎలా సంప్రదించాలో వీరిద్దరూ తెలుసుకున్నారు.
ఉద్యోగ వేట కోసం బెంగళూరుకు వెళుతున్నట్లు ఇంట్లో చెప్పి ఇళ్లు వదలిపెట్టారు. కొందరి సూచనల మేరకు ఈ ఏడాది ఆగస్టులో బెంగళూరు నుంచి దుబాయ్‌కి, అక్కడి నుంచి టర్కీకి చేరుకున్నారు. నేరుగా సిరియాకు వెళితే అనుమానం వస్తుందని జాగ్రత్తను పాటించి టూరిస్టు వీసాపై టర్కీ, మలేషియా, దుబాయ్ తదితర దేశాల మీదుగా ప్రయాణాన్ని ఖరారుచేసుకున్నారు. 15 రోజుల క్రితం వీరు టర్కీకి చేరుకోగా ఆ దేశంలో వీరి కదలికలను అనుమానించిన అక్కడి అధికారులు పదిరోజుల క్రితం తిరిగి బెంగళూరుకు పంపివేశారు.
కేంద్ర, రాష్ట్ర ఇంటెలిజెన్స్ పోలీసులు వీరిద్దర్నీ రహస్య ప్రదేశంలో ఉంచి విచారించారు. భవిష్యత్తు ఐఎస్‌దే, ఐఎస్ త్వరలో ప్రపంచాన్ని ఏలబోతోంది, అందుకే ఐఎస్ పట్ల ఆకర్షితులమైనాం, ఐఎస్‌లో చేరడం ద్వారా తాము కూడా ప్రపంచాన్ని శాసించవచ్చు అంటూ తమలో దాగిన కోర్కెను పోలీసుల ముందు బైటపెట్టారు. ఇద్దరు యువకులకు గట్టిగా కౌన్సెలింగ్ ఇచ్చి వదిలివేసినట్లు సమాచారం. అయినా మొత్తం ఈ వ్యవహారం వెనుక మరేదైనా కుట్రదాగి ఉందా అనే కోణంలో కూడా విచారణ సాగుతున్నట్లు తెలుస్తోంది.