
విధుల్లోకి పలువురు మంత్రులు
న్యూఢిల్లీ: పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖల మంత్రి వెంకయ్యనాయుడు సహా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంత్రివర్గంలోని పలువురు మంత్రులు బుధవారం తమ బాధ్యతలను స్వీకరించారు. బుధవారం బాధ్యతలు స్వీకరించిన ఇతర మంత్రుల్లో అనంత్‌కుమార్(రసాయనాలు, ఎరువులు), ఉమాభారతి( జలవనరులు), మేనకాగాంధీ(మహిళా శిశు సంక్షేమం), జితేంద్రసింగ్(పీఎంఓ, శాస్త్ర, సాంకేతిక శాఖ- సహాయ మంత్రి), రాధామోహన్ సింగ్(వ్యవసాయం) తదితరులున్నారు.
ఒకే మంత్రిపదవి, అదీ భారీ పరిశ్రమల శాఖ కేటాయించడంపై అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వచ్చిన శివసేన నేత అనంత్ గీతే కూడా బుధవారం విధుల్లో చేరారు. త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో మరో ముఖ్యమైన శాఖకు మారుస్తామన్న హామీ గీతేకు లభించినట్లు సమాచారం. శాఖ కేటాయింపునకు సంబంధించి మోడీతో తమ పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే జరిపిన చర్చ సంతృప్తికరంగా ముగిసిందని గీతే తెలిపారు. బాధ్యతల స్వీకరణ సందర్భంగా పలువురు మంత్రులు తమ ప్రాధామ్యాలను మీడియాకు వివరించారు. అవి..
‘దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి గ్రామీణ్ సించయీ యోజన పేరుతో గ్రామీణ నీటిపారుదల కార్యక్రమాన్ని, రైతుల ఆదాయ పరిరక్షణ కోసం బీమా పథకాన్ని ప్రారంభిస్తాం. గత 5-7 ఏళ్లలో రైతుల సగటు ఆదాయాన్ని గణించిన తరువాత బీమా పథకాన్ని ప్రారంభిస్తాం. ప్రీమియాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. దేశీయ ఆవుల పరిరక్షణ కోసం ఒక ప్రత్యేక పథకం ప్రారంభించాలనుకుంటున్నాం. దిగుబడి ఖర్చుపై 50శాతం అదనంగా లభించేలా కనీస మద్దతు ధరను నిర్ణయించేలా ప్రణాళిక రూపొందిస్తాం’
- రాధామోహన్ సింగ్, వ్యవసాయ శాఖ
‘ఫార్మా కంపెనీలతో మాట్లాడి ముఖ్యమైన ఔషధాల ధరను 25% నుంచి 40% వరకు తగ్గించేందుకు ప్రయత్నిస్తాను’
- అనంత్‌కుమార్, రసాయనాలు, ఎరువులు
‘ఎన్నికల సందర్భంగా మోడీ హామీ ఇచ్చిన గంగానది ప్రక్షాళనపైన ప్రధానంగా దృష్టి పెడతాను. ఇతర ముఖ్యమైన నదుల శుద్ధికి కృషి చేస్తాను’
- ఉమాభారతి, జలవనరులు