కేంద్ర మంత్రులు నజ్మా, సిద్దేశ్వర రాజీనామా
- నజ్మా స్థానంలో ముక్తార్ అబ్బాస్ నఖ్వీ
- సిద్దేశ్వర బాధ్యతలు బాబుల్ సుప్రియోకు
న్యూఢిల్లీ : కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి నజ్మా హెప్తుల్లా, భారీ పరిశ్రమల సహాయమంత్రి జీఎం సిద్దేశ్వర మంగళవారం మంత్రి పదవులకు రాజీనామా చేశారు. రాష్ట్రపతి భవన్‌కు పంపిన వీరి రాజీనామాలు ఆమోదం పొందాయి. వ్యక్తిగత కారణాలతో తప్పుకుంటున్నట్లు వీరు ప్రకటించారు. గతవారం జరిగిన కేబినెట్ విస్తరణలో 75 ఏళ్లు దాటిన నజ్మా, మిశ్రాలకు విశ్రాంతి ఇస్తారనిప్రచారం జరిగింది. అయితే.. దీనిపై ఎలాంటి నిర్ణయం లేకుండానే పునర్వ్యవస్థీకరణ జరిగింది. ఈ నేపథ్యంలోనే నజ్మా రాజీనామా ఆసక్తిగా మారింది.
జూలై 5నే వీరి ద్దరూ రాజీనామా చేయాలనుకున్నా.. నజ్మా విదేశీ పర్యటనలో, సిద్దేశ్వర వేరే చోట ఉన్నం దున మంగళవారం రాజీనామా చేసినట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. నజ్మా స్థానం లో.. మైనారిటీ వ్యవహారాల సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీకి పూర్తి బాధ్యతలు అప్పగించారు. కర్ణాటక ఎంపీ సిద్దేశ్వరను కూడా జూలై 5నే రాజీనామా చేయమని కోర గా.. ఆ రోజున తన పుట్టినరోజువల్ల రాజీనామాను వాయిదా వేశారు. అయితే బాబుల్ సుప్రియోను పట్టణాభివృద్ధి సహాయ మంత్రినుంచి తప్పించి భారీ పరిశ్రమలు, పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ శాఖ భాధ్యతలు అప్పగించారు. అయితే.. మిశ్రాకు 75 ఏళ్లు వచ్చినా.. యూపీ ఎన్నికల నేపథ్యంలో(బ్రాహ్మణ నేత) ఆయన్ను తప్పించలేదని తెలిసింది.