సాక్షి, చంఢీఘడ్ : అత్యాచారం కేసులో డేరా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌ను కోర్టు దోషిగా నిర్ధారించిన అనంతరం హరియాణాలో జరిగిన విధ్వంసకాండపైన దృష్టిని కేంద్రీకరించిన మీడియా, అధికారులు పంజాబ్‌లో జరిగిన నష్టం గురించి అంతగా పట్టించుకోలేదు. పంజాబ్‌లో జరిగిన నష్టం గురించి ఇప్పుడిప్పుడే అందిన అంచనా అందర్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. దాదాపు 200 కోట్ల రూపాయలకుపైగా నష్టం వాటిల్లిందని అధికారులు అంచనాకు వచ్చారు. అల్లర్లలో 32 మంది మరణించడం తెల్సిందే. అయితే వారిలో కూడా పది మంది పంజాబీలు ఉన్నారని తేలింది.
డేరా అల్లరి మూకలు పంజాబ్‌లోని సదన్‌వాస్ గ్రామంలో విద్యుత్ కేంద్రాన్ని, గులవాన గ్రామంలో రైల్వే స్టేషన్‌ను దగ్ధం చేశాయి. బటిండాలో ఓ టెలిఫోన్ ఎక్స్ఛేంజ్, బనవాలి, ముసాలోని రెండు పెట్రోలు బంకులను దగ్ధం చేశాయి. మానస ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ వద్ద రెండు కార్లను తగులబెట్టాయి.
మానక్‌పూర్ ప్రాంతంలోని ఓ పాఠశాల ఫర్నీచర్‌ను, మలాట్‌లోని ఓ రైల్వే స్టేషన్, నంగల్ జిల్లాలో కో-ఆపరేటివ్ సొసైటీ, ఖోఖర్ కలాన్ గ్రామంలో ఓ ప్రభుత్వ గిడ్డంగిని, సంగ్రూర్‌లో పవర్ హౌజ్‌ను అల్లరి మూకలు దగ్ధం చేశాయి. పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్ ఆదేశం మేరకు అధికారులు అల్లర్ల సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు వాటిల్లిన నష్టాన్ని అంచనా వేస్తున్నారు. ప్రాథమికంగా ఈ నష్టం 200 కోట్ల రూపాయలకుపైగా ఉంటుందని భావిస్తున్నట్లు వారు మీడియాకు తెలిపారు.