‘తలకిందులు ఫొటో’.. తలరాతను మార్చేసింది! | Upside Down Wedding Photographer Reveals His Story | Sakshi
Sakshi News home page

‘తలకిందులు ఫొటో’.. తలరాతను మార్చేసింది!

Published Sat, Apr 21 2018 1:47 PM | Last Updated on Sat, Apr 21 2018 2:05 PM

Upside Down Wedding Photographer Reveals His Story - Sakshi

త్రిసూర్‌: ‘‘జీవితంలో మరుపురాని గుర్తులంటే పెళ్లి ఫొటోలే కదండి! అందుకే వాటిని మరికాస్త వినూత్నంగా తియ్యాలనుకుంటాను. ప్రొఫెషనల్‌ ఫొటోగ్రాఫర్‌గా కొత్త తరహాలో ఆలోచించక తప్పదుమరి!’’ అంటున్నాడు 23 ఏళ్ల విష్ణు. చెట్టు పైకెక్కి తలకిందులుగా వేలాడుతూ ఫొటోలు తీసిన ఆ వీడియో ఏ రేంజ్‌లో వైరల్‌ అయిందో మీరంతా చూసే ఉంటారు. విచిత్ర విన్యాసాలు చేస్తూ అతను తీసిన తలకిందులు ఫొటో.. ఇప్పుడతని తలరాతను మార్చేసింది. సోషల్‌ మీడియా పుణ్యమాని ఓవర్‌నైట్‌లో స్టార్‌ అయిపోయిన విష్ణుకు ఇప్పుడు ఆఫర్లమీద ఆఫర్లు వచ్చిపడుతున్నాయట!

సరదాగా తీసిన వీడియో: విష్ణు స్వస్థలం కేరళలోని త్రిసూర్‌. ‘వైట్‌ర్యాంప్‌’ అనే వెడ్డింగ్‌ ఫొటోగ్రాఫర్స్‌ గ్రూప్‌లో సభ్యుడు. ఏప్రిల్‌ 15న త్రిసూర్‌కే చెందిన ‘షియాజ్‌-నవ్య’ల పెళ్లిని కవర్‌ చెయ్యడానికి వెళ్లాడు. కొత్త తరహాలో ఫొటోలు తీస్తానంటూ కొత్త జంటను కన్విన్స్‌ చేయడం, చెట్టుకొమ్మకు తలకిందులుగా వేలాడుతూ ఫొటోలు తీయడం.. అలా విష్ణు చేసిన విచిత్ర విన్యాసాలను వాళ్ల గ్రూప్‌ మెంబర్‌ ఒకరు షూట్‌ చేశారు. సరదాగా తీసిన ఆ వీడియోను త్రిసూర్‌ ఫొటోగ్రాఫర్స్‌ వాట్సప్‌ గ్రూప్‌లో అప్‌లోడ్‌ చేశారు. విపరీతంగా నవ్వుపుట్టించే ఆ వీడియో గంటల్లోనే వైరల్‌ అయింది. దాదాపు అన్ని సైట్లూ, పత్రికలూ ఫొటోగ్రాఫర్‌ విచిత్ర విన్యాసం గురించి వార్తలు రాశాయి.

విష్ణు ది వివ్వల్‌ ఫొటోగ్రాఫర్‌: ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్‌ అయిపోయిన విష్ణును త్రిసూర్‌ వాసులంతా ముద్దుగా ‘వివ్వల్‌(గబ్బిలం) ఫొటోగ్రాఫర్‌’ అని పిలుచుకుంటున్నారట. ఫొటోలు బాగా రావడంతో షియాజ్‌-నవ్యలు కూడా ఫుల్‌ఖుష్‌. పైసా ప్రచారం ఖర్చు లేకుండా ఫేమస్‌ అయిపోయిన విష్ణు అండ్‌ గ్రూప్‌కి ఇప్పుడు ఆఫర్లమీద ఆఫర్లు వస్తున్నాయట. ‘‘నిజానికి ఇంతకు ముందు కూడా నేను చెట్లెక్కి ఫొటోలు తీశాను. చిన్నప్పుడు కోతికొమ్మచ్చి బాగా ఆడేవాణ్ని. ఆ ఎక్స్‌పీరియన్స్‌ బాగా కలిసొచ్చింది..’ అని నవ్వేస్తాడు విష్ణు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement