పరీక్ష సందర్భంగా ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థ (పాత ఫొటో)
మాస్కో, రష్యా : అత్యాధునిక ఎస్-400 బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థను రష్యా నుంచి కొనుగోలు చేయాలన్న భారత్ నిర్ణయంపై అమెరికా మండిపడింది. రష్యా నుంచి క్షిపణి రక్షక వ్యవస్థను కొనుగోలు చేస్తే భారత్-అమెరికా సైనిక సహకారంపై పెను ప్రభావం ఉంటుందని యూఎస్ హౌజ్ ఆర్మ్‌డ్ సర్వీసెస్ కమిటీ ఛైర్మన్ విలియమ్ థోర్న్‌బెర్రీ హెచ్చరించారు.
భారత్ రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేయడం వల్ల కీలకమైన సాంకేతికతలను భారత్‌కు అమెరికా అందించలేదని చెప్పారు. ఎస్-400ల కొనుగోలుపై పలు స్థాయిల్లో ఆందోళనను వ్యక్తం చేస్తామని పేర్కొన్నారు. ఎస్-400ల అంశంపై అమెరికా పాలనా యంత్రాంగం, కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేస్తోందని వెల్లడించారు.
రష్యా నుంచి భారత్ ఎస్-400లను కొనుగోలు చేస్తే అమెరికా నుంచి భారత్ కొనుగోలు చేసే ప్రిడేటర్ డ్రోన్ల ఒప్పందంపై నీలినీడలు కమ్ముకునే అవకాశం ఉంటుందని చెప్పారు. కాగా, ఏప్రిల్‌లో ట్రంప్.. భారత్‌కు ప్రిడేటర్ డ్రోన్ల ఎగుమతులకు అనుమతి ఇచ్చారు. అయితే క్షిపణి రక్షణ వ్యవస్థను రష్యా నుంచి పొందేందుకు భారత్ 39 వేల కోట్ల రూపాయలు అంచనాతో ఒప్పందం కుదుర్చుకోనుంది.
Comments
Please login to add a commentAdd a comment