విదేశీ విమానాశ్రయాల్లో అమెరికా తనిఖీలు
సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు తదితర పరికరాల సోదాపై ప్రత్యేక దృష్టి
వాషింగ్టన్: విమానాశ్రయాల్లో తనిఖీని కూడా తప్పించుకోగలిగే సరికొత్త బాంబులను సిరియా, యెమెన్ దేశాల ఇస్లామ్ మిలిటెంట్లు తయారుచేస్తున్నారన్న ఇంటెలిజెన్స్ సమాచారం నేపథ్యంలో అమెరికా మరింత అప్రమత్తమైంది. అమెరికాకు నేరుగా విమాన సదుపాయం ఉన్న వివిధ దేశాల్లోని విమానాశ్రయాల్లో భద్రతను పెంచేందుకు మరిన్ని చర్యలు తీసుకుంది.
పవర్ ఆన్‌చేయని సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను విమానాల్లో అనుమతించబోమని, సదరు ఎలెక్ట్రానిక్ పరికరాలు కలిగిఉంటే, విమానం ఎక్కే ముందుగా మరింత నిశితంగా తనిఖీలకు సిద్ధపడాలని అమెరికా స్పష్టంచేసింది. తమతో తీసుకెళ్లే ఎలక్ట్రానిక్ పరికరాలు పనిచేస్తున్నవేనని, అవి పేలుడు వస్తువులు కాదని రుజువు చేసుకునేందుకు వీలుగా, ప్రయాణికులు వాటిని ఆన్‌చేసి ఉంచవలసిందిగా విదేశాల విమానాశ్రయాల్లోని తనిఖీ అధికారులు కోరతారని అమెరికా రవాణా భద్రతా శాఖ పరిపాలనా విభాగం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. చార్జింగ్‌లేని ఎలక్ట్రానిక్ పరికరాలతో విమానంలో ప్రయాణానికి అనుమతించబోమని కూడా స్పష్టంచేసింది.