ఫేస్బుక్ లో అభ్యంతకర ఫొటో పెట్టిన 16 ఏళ్ల కూతురిపై తల్లి చితకబాదిన ఘటన అమెరికాలోని జార్జియాలో చోటు చేసుకుంది.
జార్జియా: ఫేస్‌బుక్ లో అభ్యంతకర ఫొటో పెట్టిన 16 ఏళ్ల కూతురిపై తల్లి చితకబాదిన ఘటన అమెరికాలోని జార్జియాలో చోటు చేసుకుంది. అక్కడితో ఆగకుండా ఈ ఉదంతాన్ని వీడియో తీయించి తన కుమార్తె ఫేస్బుక్ పేజీలోనే ప్రత్యక్ష ప్రసారం చేసింది. షనవియా మిల్లర్ అనే మహిళ కట్టె తీసుకుని తన కూతుర్ని చితక్కొట్టింది. తర్వాత ఉత్తి చేతులతో విక్షణారహితంగా బాదింది.
బాయ్ఫ్రెండ్ తో కలిసివున్న అభ్యంతకర ఫొటోను తన కూతురు ఫేస్బుక్ లో పెట్టిందని తెలుసుకున్న ఆమె ఆగ్రహంతో ఊగిపోయింది. కూతురి చేతిలోని సెల్‌ఫోన్ లాక్కుని అక్కడే ఉన్న మరొకరి దాన్ని ఇచ్చి వీడియో తీయమంది. తర్వాత కుమార్తెపై విరుచుకుపడింది. తల్లి బారి నుంచి తప్పించుకునేందుకు ఇంట్లో మూలకు వెళ్లి దాక్కున్నా మిల్లర్ వదిలిపెట్టలేదు. నా పరువు తీస్తావా అంటూ చెడామడా చెంపదెబ్బలు వాయించింది. ఇదంతా కూతురి ఫేస్బుక్ పేజీలో ప్రత్యక్ష ప్రసారం చేసి, షేర్ చేయాలని ఫాలోవర్లను కోరింది.
కూతురిపై చేయి చేసుకోవడాన్ని ఆమె సమర్థించుకుంది. తన కుమార్తె అంటే ఎంతో ఇష్టమని, ఆమె అభాసుపాలు కాకూడదన్న ఉద్దేశంతో గట్టిగా మందలించానని చెప్పుకొచ్చింది. ఈ వీడియోను కొత్తమంది సేవ్ చేసి, యూట్యూబ్ లో పెట్టారు. తన తల్లి బాధను అర్థం చేసుకున్నానని, ఆమెపై కోపం లేదని మిల్లర్ కుమార్తె పేర్కొంది. అమ్మతోనే కలిసివుంటానని పోలీసులతో చెప్పింది. మిల్లర్ చర్యను నెటిజన్లు తప్పుబట్టారు. ఆమెను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఆమెపై కేసు నమోదు చేశారా, లేదా అనేది వెల్లడి కాలేదు.