సాక్షి, న్యూఢిల్లీ : మనీల్యాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ఈడీ విచారణకు హాజరైన ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా తనకు లండన్‌లో ఎలాంటి ఆస్తులూ లేవని దర్యాప్తు సంస్థకు తెలిపారు. లండన్‌లో వాద్రా స్ధిరాస్తుల కొనుగోలుకు సంబంధించిన లావాదేవీలు, ఆస్తుల వివరాలపై బుధవారం ఆయనను ప్రశ్నించిన ఈడీ మనీల్యాండరింగ్ చట్టం కింద వాద్రా స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసింది.
లండన్‌లో తన తరపున ఆస్తుల కొనుగోలుకు సంబంధించిన లావాదేవీలు చక్కబెట్టిన మనోజ్ అరోరా గురించి ఈడీ ప్రశ్నించగా అరోరా గతంలో తన వద్ద పనిచేసిన ఉద్యోగిగా తెలుసని, ఆయన తన తరపున ఎలాంటి ఈమెయిల్స్ రాయలేదని ఈడీ అధికారులతో తెలిపారు. వాద్రాకు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన అరోరా వాద్రాకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ ఎల్‌ఎల్‌పీ ఉద్యోగి.
కాగా ఆర్థిక అవకతవకల ఆరోపణలపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ బావ, ప్రియాంక భర్త వాద్రా దర్యాప్తు సంస్ధల ఎదుట హాజరవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కాగా అంతకుముందు వాద్రాను ప్రియాంక గాంధీ ఈడీ కార్యాలయం వద్ద డ్రాప్ చేసి పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టేందుకు నేరుగా ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. టొయోటా ల్యాండ్ క్రూయిజర్ వాహనంలో ఎస్పీజీ భద్రత నడుమ వాద్రా దంపతులు మధ్య ఢిల్లీలోని జామ్‌నగర్ హౌస్‌లోని ఈడీ కార్యాలయం చేరుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment