
సాక్షి, న్యూఢిల్లీ : యాంజియోప్లాస్టీ చికిత్స అనంతరం పూర్తిగా కోలుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శనివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారని, వైద్యుల సూచన మేరకు మూడు రోజులపాటు సంపూర్ణ విశ్రాంతి తీసుకుంటారని ఉపరాష్ట్రపతి సచివాలయం ఒక ప్రకటన చేసింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలు నేటి మధ్యాహ్నం వెంకయ్యకు ఫోన్‌చేసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారని ప్రకటనలో పేర్కొన్నారు.
విశ్రాంతి అవసరమైన కారణంగా నేటి నుంచి మూడు రోజులపాటు ఉపరాష్ట్రపతిని కలిసేందుకు సందర్శకులెవరికీ అనుమతి ఉండబోదని సచివాలయ అధికారులు తెలిపారు. శుక్రవారం ఉదయం వెంకయ్య అస్వస్థతతో ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరగా, పరీక్షలు జరిపిన వైద్యులు ఆయన గుండెకు సంబంధించిన ఓ నాళం పూడుకుపోతున్నట్లు గుర్తించారు. అదేరోజు ఎయిమ్స్ కార్డియాలజీ ప్రెఫెసర్ డాక్టర్ బలరాం భార్గవ నేతృత్వంలో యాంజియోప్లాస్టీ నిర్వహించిన వైద్యులు.. పూడుకుపోతున్న నాళంలో స్టెంట్ వేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment