గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ (ఫైల్ ఫొటో)
అహ్మదాబాద్ : గత కొన్ని రోజులుగా వివాదాస్పద వ్యాఖ్యలతో బీజేపీ నాయకులు వార్తల్లో నిలుస్తున్నారు. త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్‌కుమార్ దేవ్ వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా.. సోషల్ మీడియాలో ఆయనను నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ మేరకు ఆయనకు పీఎంవో నుంచి సమన్లు కూడా అందినట్లు సమాచారం. ప్రస్తుతం గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా విప్లవ్ తరహాలోనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) మీడియా వింగ్ విశ్వ సంవాద్ కేంద్ర ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో పాల్గొన్న విజయ్ రూపానీ మాట్లాడుతూ.. సెర్చ్ ఇంజిన్ గూగుల్‌ను నారద మహర్షితో పోల్చారు. ‘ప్రపంచంలో ఉన్న సమాచారమంతా నారద మహర్షి దగ్గర ఉండేది. అంటే గూగుల్‌ను ఆయనతో పోల్చవన్న మాట. అయితే నారదుడు తన దగ్గరున్న సమాచారాన్ని మంచి కోసమే వినియోగించేవారని’ విజయ్ రూపానీ వ్యాఖ్యానించారు.
‘నారదుడు అందరికీ మంచి చేశాడు. అందుకే ఆయనను రుషిగా అంగీకరించారు. నారదుడు మనుషుల మధ్య కలహాలు సృష్టించాడనే అపవాదు ఉంది. కానీ అది నిజం కాదు. ప్రజల సంక్షేమం కోసమే ఆయన అలా చేశారంటూ’ రూపానీ పేర్కొన్నారు. నారదుడు నిజమైన జర్నలిస్టు అని, ప్రస్తుతమున్న జర్నలిస్టులు కూడా నారద మహర్షిలాగే ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలంటూ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment