మధురై: ఫొటో చూడగానే కొంత ఆశ్చర్యం, మరికొంత సందేహం కలుగుతోందా?.. కానీ, మీరు అవునన్నా, కాదన్నా అది మాస్కే. కాకపోతే ముఖానికి ధరించే మాస్క్ మాత్రం కాదు. అచ్చంగా, స్వచ్ఛంగా పిండితో చేసిన నోరూరించే "పరోటా మాస్క్". తమిళనాడులోని మధురైలోని రెస్టారెంట్ నిర్వాహకులకు వచ్చిందీ అద్భుత ఆలోచన. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా ఈ ఆలోచన అమలు చేయడం ద్వారా అటు కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు ఇటు బిజినెస్ కూడా బాగుంటోంది. మొదట్లో రెండు మాస్క్ పరోటాలు ఉండే ప్లేట్‌ను 40 రూపాయలుగా నిర్ధారించారు. కానీ దానికి విపరీతమైన డిమాండ్ రావడంతో ఆ ధరను 50 రూపాయలకు పెంచారు. (బడా బాబు మాస్క్ ఖరీదు రూ.2.89 లక్షలు)
దీనిపై హోటల్ యజమాని కేఎల్ కుమార్ మాట్లాడుతూ.. "ఇంతకుముందు మా హోటల్‌కు మాస్కు లేకుండా వచ్చేవారు. కానీ ఇప్పుడు మాస్కు పరోటాలు కొనడానికే వస్తున్నారు" అని తెలిపాడు. ఇంతకీ ఈ పరోటా మాస్క్‌ను పరోటా స్పెషలిస్టు ఎస్ సతీష్ రెండు రోజుల ప్రయోగం ద్వారా తుదిరూపు తీసుకొచ్చాడు. మాస్కుల్లో రకాలున్నట్టే.. మాస్కుల పరోటాలోనూ రకాలున్నాయంటున్నాడు. వీటి తయారీ విధానాన్ని అక్కడున్న వంటవారికి నేర్పిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మాస్కుల పరోటాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. "ఈ ఫొటో చూసి మీ మాస్కు తినేయకండి" అంటూ కొందరు జోకులు పేల్చుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment