ఆమె అలా ఎందుకు వచ్చారో అర్థం కాలేదు...
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ లోక్సభ వెల్ లోకి దూసుకు రావడంపై స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విపక్ష నేత అకస్మాత్తుగా అలా స్పీకర్ పోడియంను చుట్టుముట్టడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె అలా ఎందుకు ప్రవర్తించారో్ తనకు అర్థం కాలేదన్నారు. అసలే సభ్యుల నిరసనలు, నినాదాలతో వాతావరణం వేడెక్కి ఉన్నపుడు, సంయమనం పాటించాల్సిన సోనియా గాంధీ, అలా వెల్లోకి చొచ్చుకు రావడంతో తాను షాకయ్యానని చెప్పారు.
నిబంధనలకు విరుద్ధంగా ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించడం, అన్ పార్లమెంటరీ పదాలను ఉపయోగించడం సరికాదన్నారు. ఒకదశలో ఎవరిది తప్పో, ఎవరిదిరైటో తాను తేల్చుకోలేక పోయానంటూ సుమిత్రా తన అభిప్రాయాలను మీడియా తో పంచుకున్నారు. సభలో గందరగోళం చెలరేగుతున్నపుడు తనను తాను నియంత్రించుకోవడానికి చాలా ప్రయత్నించానని చెప్పారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఎలాంటి దిశానిర్దేశం లేకుండానే ముగిసాయి. ముఖ్యంగా లలిత్గేట్, వ్యాపం కుంభకోణాలు ఉభయ సభల్లోనూ వివాదాన్ని రాజేసాయి. కేంద్రమంత్రి సుష్మ, ముఖ్యమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, వసుంధరా రాజే రాజీనామా చేయాల్సిందేనని పట్టుబట్టాయి. ఈ నేపథ్యంలో సోనియా, తన ఎంపీలతో సహా వెల్లోకి దూసుకువచ్చి, నినాదాలు చేశారు. దీనిపై అధికార పక్షం బీజేపీ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.