ముంబైలో యువ న్యాయవాది హత్య కేసులో ఆమె నివసించిన భవన వాచ్మన్ను కోర్టు దోషిగా తేల్చింది. అతడికి విధించే శిక్షను జూలై 3వ తేదీన నిర్ధరించనుంది. ముంబై మహానగరంలో 2012లో పల్లవీ పురకాయస్థ అనే న్యాయవాది దారుణ హత్యకు గురి కావడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆమె ఫ్లాట్ బయట, పక్కింటివాళ్ల డోర్ బెల్ మీద కూడా రక్తపు మరకలు ఉండటంతో ఆమె హంతకుడి బారి నుంచి తప్పించుకుని సాయం కోసం పరుగులు తీసినట్లు రుజువైంది.
ఈ హత్యకేసులో ఆమె ఉన్న భవన వాచ్మన్ సజ్జాద్ అహ్మద్ పఠాన్ (22) ఆమెను చంపినట్లు కోర్టులో రుజువైంది. జడ్జి ఈ విషయాన్ని వెల్లడించేటప్పుడు అతడు మౌనంగా తల ఊపుతూ ఉండిపోయాడు తప్ప ఎలాంటి భావాలు పలికించలేదు. జాతీయస్థాయి స్విమ్మర్ కూడా అయిన పల్లవి వడాలా ప్రాంతంలోని 'హిమాలయన్ హైట్స్' అపార్టుమెంట్ 16వ అంతస్థులో 2012 ఆగస్టు 9న హత్యకు గురైంది. పదేపదే తనవైపు చూడొద్దని ఆమె హెచ్చరించడంతోనే సజ్జాద్ ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించి, సాధ్యం కాకపోవడంతో చంపేశాడు.
పక్కింటివాళ్ల డోర్ బెల్ మోగించినా, తలుపు వద్ద ఆమె కనిపించకపోవడంతో వాళ్లు తియ్యలేదు. ఇంతలో సజ్జాద్ వచ్చి పల్లవి గొంతుకోసి చంపేశాడు. ఈ కేసులో మొత్తం 40 మంది సాక్షులను కోర్టు విచారించింది. లా కాలేజీలో పల్లవితో ప్రేమలో పడి.. త్వరలోనే ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న అవిక్ సేన్ గుప్తా కూడా సాక్ష్యం ఇచ్చారు. గత సంవత్సరం నవంబర్ నెలలో అతడు అనారోగ్యంతో మరణించాడు.
న్యాయవాది హత్య: వాచ్మనే హంతకుడు!!
Published Mon, Jun 30 2014 3:29 PM | Last Updated on Wed, Aug 1 2018 2:29 PM
Advertisement
Advertisement