కలసికట్టుగా ముందుకు సాగుదాం
కాన్‌బెర్రా: భారతదేశ ఆలోచనల్లో ఆస్ట్రేలియా కేంద్ర బిందువుగా ఉంటుందని.. దృష్టి పరిధికి ఆవల కాదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య సన్నిహితమైన భద్రతా సహకారం ఉండాలని.. ఉగ్రవాద ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు సమగ్ర ప్రపంచ వ్యూహం అవసరమని ఆయన పిలుపునిచ్చారు. మోదీ మంగళవారం నాడు ఆస్ట్రేలియా పార్లమెంటులో ప్రసంగించారు. భారత ప్రధాని ఒకరు ఆస్ట్రేలియా పార్లమెంటులో ప్రసంగించటం ఇదే ప్రధమం. ‘‘భారత ప్రధానమంత్రి ఆస్ట్రేలియాకు రావటానికి 28 సంవత్సరాలు పట్టింది. ఇలా జరిగి ఉండాల్సింది కాదు. ఆస్ట్రేలియా మా దృష్టి పరిధి చివర్లో ఉండదు. మా ఆలోచనల కేంద్రంలో ఉంటుంది’’ అని ఆయన పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలను ప్రస్తావించారు. మోదీ ప్రసంగంలోనిముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...
ఉగ్రవాదం స్వభావం మారుతోంది: ‘‘ఉగ్రవాదం ప్రధాన ప్రమాదంగా మారింది. భారత్‌లో మేం మూడు దశాబ్దాల పాటు దాని ముఖాన్ని విస్పష్టంగా చూశాం. ఇంటర్నెట్ ద్వారా ఉగ్రవాద సంస్థల్లో చేరికలకు, హింసాప్రేరణ పెరుగుతున్నాయి. నగదు అక్రమ లావాదేవీలు, మాదకద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాపై ఆధారపడి ఉగ్రవాదం మనుగడ సాగిస్తోంది. ఉగ్రవాద మూకల విషయంలో ఎటువంటి తేడా చూపని, దేశాల మధ్య వివక్షకు తావులేని ఒక విధానం, ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చే వారిని దూరంపెట్టేందుకు ఒక సంకల్పం, వాటితో పోరాడే దేశాలను బలోపేతం చేసేందుకు ఒక సామాజిక ఉద్యమం రావాలి. ఇందు కోసం మతాన్ని - ఉగ్రవాదాన్ని విడదీసి చూడటం అవసరం.
ఈ ప్రాంతంలో ఆర్థిక సమ్మిళిత వృద్ధితో కూడిన స్వేచ్ఛా ప్రపంచ వాణిజ్య వ్యవస్థకు మద్దతు అందించాలి. ప్రాంతీయ వాణిజ్య కార్యక్రమాల ప్రారంభమనేది రాజకీయ పోటీ సాధనాలుగా మారటాన్ని నిరోధిస్తూ మనం భద్రత కల్పించాలి.
సముద్ర జలాల భద్రత రంగంలోనూ పరస్పర సహకారం పెంచుకోవాలి. అంతర్జాతీయ చట్టం, ప్రపంచ ప్రమాణాలను అందరూ గౌరవించేందుకు మనం కృషి చేయాలి.
భారత్, ఆస్ట్రేలియాలు ప్రపంచ వేదికలపై మరింత సన్నిహితంగా సమన్వయం చేసుకోవాలి. భారత అభివృద్ధి ఆస్ట్రేలియాకు వ్యవసాయం, ఆహార శుద్ధి, గనుల తవ్వకాలు, మౌలిక సదుపాయాలు, ఆర్థిక, సాంకేతిక, ఇంధనశక్తి రంగాల్లో దీర్ఘకాలిక అవకాశాలను అందిస్తుంది. ‘మేక్ ఇన్ ఇండియా’ అనేదానిని ప్రపంచ వ్యాప్త పేరుగా మలచాలనే బృహత్తర కార్యక్రమం మేం చేపట్టాం.’’
వచ్చే ఏడాది భారత్‌కు యురేనియం.. టోనీ: మోదీకి ముందు ఆస్ట్రేలియా ప్రధాని టోనీ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగిస్తూ.. అన్నీ సక్రమంగా కుదిరితే వచ్చే ఏడాది భారత్‌కు యురేనియంను సరఫరా చేస్తామని పేర్కొన్నారు. ‘భారత్ తన ఇంధన శక్తికి, ఆహార భద్రతకు ఆధారపడగల మూలాధారంగా ఉండాలని మేం కోరుకుంటున్నాం’ అని చెప్పారు. ఆస్ట్రేలియాలో తన 5రోజుల పర్యటనను ముగించుకుని మోదీ ఫిజీ చేరుకున్నారు.
‘షర్ట్‌ఫ్రంటింగ్’ అంటే ఇదేనా?
‘‘ఈ వారంలో మీరు వింటున్న మూడో ప్రభుత్వాధినేత ప్రసంగమిది. ఇది మీరు ఎలా చేస్తున్నారో నాకు తెలీదు! బహుశా.. ఇది ప్రధానమంత్రి అబోట్ మిమ్మల్ని షర్ట్ ఫ్రంటింగ్ చేసే విధానమేమో!’’ అని మోదీ వ్యాఖ్యానించటంతో ఆస్ట్రేలియా పార్లమెంటు సభ్యులందరూ ఘొల్లున నవ్వారు. ఫుట్‌బాల్ క్రీడలో.. ఒక క్రీడాకారుడు ప్రత్యర్థి జట్టు క్రీడాకారుడిని కిందపడదోసేందుకు తన భుజాలతో అతడి ఛాతీని ఢీకొట్టడాన్ని.. ‘షర్ట్ ఫ్రంటింగ్’ అంటారు. ఆస్ట్రేలియా పార్లమెంటులో వారం రోజుల వ్యవధిలో బ్రిటిష్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరాన్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌లు ప్రసంగించారు. ఆ వెంటనే తాను కూడా ప్రసంగిస్తుండటంతో.. మోదీ తన మాటల్లో వరుసగా ముగ్గురు దేశాధినేతల ప్రసంగాలు వినిపిస్తున్నారంటూ.. ‘ప్రధాని టోనీ మిమ్మల్ని షర్ట్ ఫ్రంటింగ్ చేసే పద్ధతి ఇదేనేమో’ అని సరదాగా వ్యాఖ్యానించి నవ్వులు పూయించారు.