'లాహోర్‌లో మన త్రివర్ణ పతాకం ఎగరాలి'
భారతసైన్యం నియంత్రణ రేఖ వెంబడి చేసిన దాడులను పలు రాజకీయ పార్టీలు ప్రశంసించాయి. బీజేపీ మిత్రపక్షంగా ఉంటూనే ఇటీవలి కాలంలో కొంత దూరంగా కూడా ఉంటున్న శివసేన సైతం ఈ విషయంలో సైన్యానికి అండగా నిలిచింది. లేటుగా వచ్చినా లేటెస్టుగా వచ్చారంటూ శివసేన ప్రతినిధి అరవింద్ సావంత్ ప్రశంసించారు. ఇక ఇప్పుడు ఆగేందుకు సమయం లేదని, లాహరో వెళ్లి మరీ మన త్రివర్ణ పతాకాన్ని ఎగరేయాలని ఆయన అన్నారు. అంటే ఒక రకంగా పాకిస్తాన్‌ను ఆక్రమించాలన్నట్లుగా ఆయన వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ ప్రతినిధి ఆర్ఎస్ సుర్జేవాలా కూడా సైన్యం చర్యలను ప్రశంసలలో ముంచెత్తారు. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పాక్ శిబిరాలను ధ్వంసం చేయడంలో భారత సైన్యం చూపించిన అసమాన ధైర్య సాహసాలకు సెల్యూట్ అని ఆయన అన్నారు. ఈ శిబిరాల వల్లే పాకిస్తాన్ నుంచి చొరబాటుదారులు భారత భూభాగంలో ప్రవేశిస్తున్నారని ఆయన చెప్పారు. మే 9వ తేదీన, తర్వాత మళ్లీ 20, 21 తేదీలలో నిర్వహించిన ఈ దాడుల్లో ప్రధానంగా రాకెట్ లాంచర్లు, యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైళ్లు, ఆటోమేటెడ్ గ్రనేడ్ లాంచర్లు, రికోయిలెస్ గన్‌లు ఉపయోగించినట్లు భారత సైన్యం తెలిపింది.
కౌంటర్ టెర్రరిజం వ్యూహంలో భాగంగా నియంత్రణ రేఖను పూర్తిగా డామినేట్ చేస్తోందని, ఉగ్రవాదులు చొరబాట్లకు పాల్పడే ప్రాంతాలను మనం టార్గెట్ చేసుకున్నామని ఆర్మీ ప్రతినిధి మేజర్ జనరల్ అశోక్ నరులా చెప్పారు. నియంత్రణ రేఖ వెంబడి చొరబాట్లు తగ్గాలని, తద్వారా జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదుల సంఖ్య తగ్గిస్తే అక్కడి యువత మీద దుష్ప్రభావాలు పడకుండా ఉంటాయని ఆయన అన్నారు.