
‘ఉరితీస్తే మాత్రం భారత్ ఇలా చేయాలి’
న్యూఢిల్లీ: పాకిస్థాన్ తీరుపై బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతీయ నేవీ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్‌ను పాకిస్థాన్ ఉరితీస్తే మాత్రం ఇండియా బలోచిస్థాన్‌ను స్వతంత్ర్య దేశంగా తప్పకుండా గుర్తించాల్సిందేనని అన్నారు. సింధ్ ప్రావిన్స్‌ను పాకిస్థాన్ విడిచి వెళ్లాల్సిందేనని డిమాండ్ చేశారు. గూఢచర్యానికి పాల్పడ్డాడంటూ భారత్‌కు చెందిన నేవీ మాజీ అధికారి కులభూషణ్‌కు ఉరిశిక్ష విధిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ విషయంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్లమెంటులో కూడా ఈ విషయంపై తీవ్ర స్థాయిలో మంగళవారం చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో సుబ్రహ్మణ్యస్వామి తాజా వ్యాఖ్యలు చేశారు. పాక్ ఉరిశిక్ష ప్రకటించిన వెంటనే సోమవారం స్పందించిన స్వామి పాకిస్థాన్‌కు భారత్ గట్టి వార్నింగ్ ఇవ్వాల్సిందేనని కోరిన విషయం తెలిసిందే. జాదవ్‌ను ఉరితీస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, ఆ దేశానికి మంచిదికాదని నేరుగా హెచ్చరించాలని కేంద్రాన్ని కోరారు.