వాళ్లు ఒప్పుకున్నా...మేం అడ్డుకుంటాం
♦ మతాంతర వివాహానికి సిద్ధమైన ప్రేమికులు
♦ అంగీకరించిన ఇరు కుటుంబాలు
♦ ఇది లవ్ జీహాది అంటూ హిందూ సంఘటన కార్యకర్తల ధర్నా
మాండ్య (కర్ణాటక): ఓ ప్రేమ జంట మతాంతర వివాహానికి ఇరు కుటుంబాలు అంగీకరించినా అది లవ్ జీహాద్ అంటూ హిందూ సంఘటన కార్యకర్తలు యువతి ఇంటి ఎదుట ధర్నాకు దిగారు. ఈ ఘటన కర్ణాటకలోని మాండ్య జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. మాండ్య నగరంలోని అశోకనగర్ రెండో క్రాస్‌లో నివాసం ఉంటున్న డాక్టర్ హెచ్.వి.నరేంద్రబాబు, గాంధీనగర్‌లో నివాసం ఉంటున్న బియ్యం వ్యాపారి ముఖ్తార్ ఆహ్మద్ బాల్య స్నేహితులు. నరేంద్రబాబు కుమార్తె అశితా, ముఖ్తార్ అహ్మద్ కుమారుడు షకీల్ చిన్నప్పటి నుంచి ఎంబీఎ వరకు కలిసి చదువుకున్నారు. పీయూసీలో మొదలైన వీరిద్దరి ప్రేమ చదువు పూర్తయ్యేవరకు కొనసాగింది.
ఇరుకుటుంబాలు వీరి వివాహానికి అంగీకరించాయి. ఈ నెల 17న మైసూరులోని తాజ్ కన్వెన్షన్ హాల్‌లో వివాహానికి ఏర్పాట్లు చేసుకున్నారు. విషయం తెలుసుకున్న హిందూ సంఘటన కార్యకర్తలు మంగళవారం యువతి ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. ఇది మతాంతర వివాహం కాదని.. లవ్ జీహాది పేరుతో ఓ మతానికి చెందిన యువకుడు, మరో మతానికి చెందిన యువతిని వివాహం చేసుకుంటున్నాడని ఆరోపించారు. వివాహానికి యత్నిస్తే తాము అడ్డుకుంటామని హెచ్చరించారు. యువతి తల్లిదండ్రులు మాట్లాడుతూ.. ఇద్దరూ చిన్న వయసు నుంచి కలిసి చదువుకొని ప్రేమించుకున్నారని, అం దుకే వారి వివాహానికి అంగీకరించామని, ఇందులో మతాలు మారడం ఏమీ లేదని పేర్కొన్నారు. యువకుడి తండ్రి ముఖ్తార్ అహ్మద్ సైతం ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. వివాహ వేడుకల్లో ఎలాంటి గొడవలు పెట్టుకోవద్దని విన్నవించారు.