ఢిల్లీ: కేంద్రం ముందు నాలుగు డిమాండ్‌లను ఉంచుతున్నామని, వాటిని ఆమోదించని పక్షంలో రాజీనామాలకు సిద్ధమని సీమాంధ్ర మంత్రులు స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం సమావేశమైన సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు, మంత్రులు. ఆంటోని కమిటీకి వివరించాల్సిన విషయాలపై ముఖ్యంగా చర్చించారు. సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ తీవ్రంగా దెబ్బ తింటుందని ఆంటోనీకి కమిటీకి వివరించేందుకు నేతలు సన్నద్ధమైయ్యారు. భేటీ ముగిసిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచకపోతే..హైదరాబాద్‌ను కేంద్ర పాలితంగా చేయాలని డిమాండ్‌ను కమిటీకి వివరించాలని సమావేశంలో తీర్మానించారు. ఈ నెల 30లోగా సీమాంధ్ర ప్రజల డిమాండ్‌లపై కేంద్రం ప్రకటన చేయాలన్నారు. .కాగా, ఈ రోజు ఆంటోనీ కమిటీతో జరగాల్సిన సీమాంధ్ర నేతల సమావేశం రేపటికి వాయిదా పడింది. ఈ మేరకు నాలుగు డిమాండ్‌లను ఆంటోనీకి కమిటీ దృష్టికి తీసుకువెళ్లనున్నారు.
1.రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలి
2.విభజన అనివార్యమైతే హైదరాబాద్‌ను కేంద్రపాలితప్రాంతంగా చేయాలి
3.తెలంగాణ, సీమాంధ్రలకు వేర్వేరుగా రాజధానులు ఏర్పాటుచేయాలి
4. తెలంగాణ విషయంలో కేంద్రం మరింత స్పష్టత ఇవ్వాలి