
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జాతీయ రాజధానిలో సేవల నియంత్రణపై ఆర్డినెన్స్ విషయమై కేంద్రంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీపై కేంద్ర తొలి దాడి జరిగింది, ఆ తర్వాత ఇతర రాష్ట్రాలకు ఇలాంటి ఆర్డినెన్స్‌లే వస్తాయని కేజ్రీవాల్ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన రాంలీలా మైదానంలో జరిగిన ఆమ్‌ఆద్మీ పార్టీ మహా ర్యాలీలో పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంపై ఈ విధంగా వ్యాఖ్యానించారు.
కేంద్రం ఆర్డినెన్స్‌తో నగర ప్రజలను అమానిస్తోందన్నారు. ఢిల్లీలో ప్రజాస్వామ్యం ఉందని ఆ ఆర్డినెన్స్ చెబుతోందంటూ ఆరోపణలు చేశారు. ఢిల్లీలో నియంతృత్వ పాలన కొనసాగుతోందన్నారు. సాక్షాత్తు లెఫ్టినెంట్ గవర్నరే ప్రజలు ఎవరికీ కావాలంటే వారికి ఓటు వేయవచ్చు, కానీ ఢిల్లీని కేంద్రమే నడుపుతుందని చెబుతున్నారని కేజ్రీవాల్ మండిపడ్డారు. దీన్ని వ్యతిరేకిస్తూ..దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నా..ఢిల్లీ ప్రజలు ఒంటరిగా లేరని వారికి భరోసా ఇవ్వాలనుకుంటున్నా అని చెప్పారు.
భారతదేశంలో 140 కోట్ల మంది ప్రజలు తమ వెంట ఉన్నారని ఆయన ధీమాగా చెప్పారు. ఈ సందర్భంగా ఆప్ నేత మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్‌ల అరెస్టుల గురించి మాట్లాడుతూ..దేశ రాజధానిలో పనులు నిలిపివేయడానికే వారిని అరెస్టు చేశారన్నారు. అయినప్పటికీ తమ వద్ద వందమంది సిసోడియాలు, జైనులు ఉన్నారని, వారు తమ పనిని కొనసాగిస్తారని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. కాగా, ఈ కార్యక్రమానికి రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ కూడా హాజరయ్యారు.