'సంక్షేమం'తోనే ప్రజల మద్దతు
బీజేపీ కార్యకర్తలతో ప్రధాని మోడీ
{పధాని అయ్యాక తొలిసారి పార్టీ కార్యాలయానికి..
పార్టీని గెలిపించినందుకు కార్యకర్తలకు కృతజ్ఞతలు
న్యూఢిల్లీ: ‘ప్రజా సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేయడమనే పరీక్షలో పాసైతే ప్రజలు మనల్ని కొనియా డతారు. మన వెంట ఉంటారు’ అని ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ కార్యకర్తలకు ఉద్బోధించారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అంతర్‌ప్రవాహం, ఒకే భావధార లేకపోయినట్లయితే బీజేపీకి అఖండ విజ యం సాధ్యమయ్యేది కాదన్నారు. మోడీ ప్రధాని పద వి చేపట్టాక తొలిసారి ఆదివారం ఇక్కడి పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకుని కార్యకర్తలతో ముచ్చటించారు. బీజేపీ అధ్యక్షుడు, హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఇతర నేతలు కూడా పాల్గొని ప్రసంగించారు.
లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేసినందుకు మోడీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. వారు గొప్పవారని, వారి కఠిన శ్రమ వల్లే ప్రధానిని అయ్యానన్నారు. ‘ప్రజలు వారి ఆకాంక్షలు నెరవేస్తామనే ఆశతో కులమతాలు, రాజకీయ సమీకరణాలకు అతీతంగా మనకు ఓటేశారు. వారి ఆకాంక్షలను నిబద్ధతతో నెరవేర్చాల్సిన బాధ్యత మన ప్రభుత్వంపై ఉంది. ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేస్తోందని ప్రజలు విశ్వసిస్తే వారు పార్టీతో సంబంధాలను ఎన్నటికీ తెంచుకోరు’ అని వ్యాఖ్యానించారు. బ్రిటన్‌లో టోనీ బ్లెయిర్ నాయకత్వంలో లేబర్ పార్టీ, తొలి పర్యాయం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఒబామా విజయం సాధించినట్లుగా బీజేపీ గెలిచిందని, దీనిపై రాజకీయ విశ్లేషకులు, సామాజిక శాస్త్రవేత్తలు అధ్యయనం చేసి, పుస్తకాలు వెలువరించాల్సిన అవసరముందన్నారు. అటల్ బిహారీ వాజ్‌పేయి తొలిసారి ప్రధాని అయ్యాక పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చినప్పుడు తనకెంతో సంతోషం కలిగిందని గుర్తు చేసుకున్నారు. ఆ రోజు సన్నాహాల కోసం కార్యకర్తలా కష్టపడ్డానన్నారు. ‘పార్టీ కార్యాలయానికి రావాలని వాజ్‌పేయిని అడగ్గా, ఎందుకని ఆయన తిరిగి అడిగారు. మీరిప్పుడు ప్రధాని, కార్యకర్తల చెంత మీరుంటే వారు సంతోషిస్తారు అని చెప్పా.. ఇప్పుడు మీరు నాకిచ్చిన గౌరవాన్ని ఊహించుకోలేపోతున్నా’ అని ఉద్వేగంగా అన్నారు.
దేశ శక్తి గురించి లోకానికి తెలిసింది
ప్రధానిగా తన ప్రమాణ స్వీకారానికి దక్షిణాసియా ప్రాంతీయ సహకార సమితి(సార్క్) దేశాధినేతలను ఆహ్వానించడం సరైన సమయంలో తీసుకున్న సరైన నిర్ణయమని మోడీ పేర్కొన్నారు. తన ఈ తొలి విదేశాంగ విధాన చొరవ వల్ల భారత్ శక్తి గురించి ప్రపంచానికి సందేశం వెళ్లిందన్నారు. అందరూ ప్రశంసిస్తున్న ఈ నిర్ణయం గురించి ప్రపంచం ఇప్పటికీ మాట్లాడుకుంటోందన్నారు. మన దేశ గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేస్తే అది మన దేశానికి తగిన గౌరవం ఇస్తుందన్నారు.
నేడు మంత్రులతో మోడీ భేటీ
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రిమండలికి ఇప్పటికే 100 రోజుల అజెండాను నిర్దేశించిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. సమర్థ పరిపాలన, ప్రభుత్వ కార్యక్రమాల అమలు తదితర అంశాలపై చర్చించేందుకు సోమవారం నాడు తన మంత్రివర్గ సహచరులందరితో సమావేశం కానున్నారు. పెట్టుబడుల పెంపుదల, నిర్ణీత కాల పరిమితిలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పూర్తి, సహజ వనరుల సమర్థ వినియోగం తదితర పది సూత్రాల అజెండాను నిర్దేశించుకున్న మోడీ.. ఆయా అంశాలపై 44 మంది మంత్రుల నుంచి సూచనలు కోరే అవకాశముంది. ఈ సమావేశంలో చర్చకు వచ్చే ముఖ్యాంశాలు నాలుగో తేదీ నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు ఉభయసభల సమావేశాల్లో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ప్రసంగంలో ప్రతిఫలించనున్నాయి.
పీఎంఓ పేజీకి 11 లక్షల లైక్‌లు
ప్రధానమంత్రి కార్యాలయం ఫేస్‌బుక్ పేజీ ‘పీఎంఓ ఇండియా’ ఆరంభంలోనే అదరగొట్టింది. ప్రారంభమైన నాలుగు రోజుల్లోనే దీనికి 11 లక్షలకుపైగా లైక్‌లు వచ్చాయి. సోషల్ మీడియాను విస్తృతంగా వాడే ప్రధాని మోడీ విధుల్లో ఉన్న ఫోటో పేజీ ముఖచిత్రంగా ఉంది. మోడీని పలువురు ప్రముఖులు అభినందిస్తున్న ఫోటోలు, ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం సందర్భంగా ఆయనిచ్చిన సందేశాన్ని పీఎంఓ ఇందులో పోస్ట్ చేసింది. ఈ సందేశాన్ని వేలాది మంది ఇష్టపడ్డారు.