'రాజకీయ రణ క్షేత్రాలుగా యూనివర్సిటీలు'
న్యూఢిల్లీ: మొన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ, నేడు జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ ఎందుకు రాజకీయ రణ క్షేత్రాలగా మారుతున్నాయి? కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీలు జోక్యం వల్ల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ రాజకీయ రణ క్షేత్రంగా మారిపోగా, నేడు సాక్షాత్తు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జోక్యం చేసుకొని విద్యార్థి నాయకులను అరెస్ట్ చేయించగా జేఎన్‌యూ రాజకీయ రణ క్షేత్రంగా మారింది.
రాజకీయ లబ్ధి కోసమే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, యూనివర్శిటీల్లో కల్లోల పరిస్థితులను సృష్టిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో బీజేపీ ద్విముఖ వ్యూహాన్ని అనుసరిస్తున్నట్టు కనిపిస్తోంది. హిందుత్వ శక్తులను కూడగట్టడం ద్వారా రానున్న అస్సాం, కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందాలన్నది తక్షణ వ్యూహం కాగా, హిందూ భావజాలాన్ని విద్యార్థుల్లో విస్తరించడం ద్వారా పార్టీ రాజకీయ పునాదులను పటిష్టం చేసుకోవడం దీర్ఘకాలిక వ్యూహంగా కనిపిస్తోంది.
వామపక్ష భావాజాలం ప్రభావాన్ని అరికట్టి, హిందుత్వ భావాజాలంలోకి విద్యార్థులను తీసుకరావడం కోసమే జేఎన్‌యూలో బీజేపీ ప్రత్యక్షంగా జోక్యం చేసుకొందన్న వాదన వినిపిస్తోంది. దేశాన్ని ధిక్కరిస్తే సహించేది లేదన్న రాజ్‌నాథ్ సింగ్ నిజానిజాల జోలికి వెళ్లకుండా భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసిన విద్యార్థుల వెనక లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ ఉన్నారంటూ ట్విట్టర్‌లో వచ్చిన నకిలీ ట్వీట్‌ను ఉదహరించారు. హఫీజ్ స్పెల్లింగ్‌లో ఉన్న పొరపాటును కూడా గమనించకుడా తొందరపడ్డారంటే వారి ఎజెండా ఏమిటో స్పష్టంగానే తెలుస్తోంది.
జేఎన్‌యూ మొదటి నుంచి భావప్రకటనా స్వేచ్ఛకు పెద్ద పీట వేస్తోంది. అందుకే అది పరస్పర భిన్నాభియ్రాల నిలయంగా మారింది. అతివాదులు, మితవాదుల, తీవ్రవాదుల భావాజాలం మధ్య అక్కడ తరచుగా సదస్సులు, సమావేశాలు జరుగుతూనే ఉంటాయి. ప్రపంచంలో ఏ రాజకీయ పరిణామం చోటు చేసుకున్నా జేఎన్‌యూ స్పందిస్తుంది. అందుకే పోలండ్ సంఘీభావ దినోత్సవాన్ని జరుపుకొంది. చైనాలోని తియాన్మన్ స్క్వేర్‌లో ప్రజాస్వామ్య విగ్రహాన్ని విద్యార్థులు ఆవిష్కరించడాన్ని హర్శించిందీ, గర్హించింది. పర్యవసానంగా చైనా ప్రభుత్వం విద్యార్థులను కాల్చివేయడాన్ని ఖండించింది.
సోవియెట్ యూనియన్ విచ్ఛిన్నాన్ని వ్యతిరేకించిన వారూ ఉన్నారు. స్వాగతించిన వారూ ఉన్నారు. ఇదే పరంపరలో అఫ్జల్ గురు కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసింది. అఫ్జల్ గురుకు అనుకూలంగా నినాదాలు ఇవ్వడం కూడా కొత్తకాదు. అఫ్జల్ గురు అరెస్టు నాటి నుంచి ఆయనను సమర్థిస్తున్న ఒక వర్గం కూడా యూనివర్శిటీలో ఉంది. అయినా ఈ విషయాలేవి పెద్దగా బయట ప్రపంచానికి తెలిసేవి కావు. యూనివర్శిటీ ఆవరణ వరకే పరిమితమయ్యేవి. ఇప్పుడు రాజకీయ జోక్యం వల్ల బయటకొస్తున్నాయి. కల్లోల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇందుకు ఎవరు బాధ్యత వహిస్తారు?
-ఓ సెక్యులరిస్ట్ కామెంట్