జార్ఖండ్ కొత్త సీఎం ఎవరు?
రాంచీ: జార్ఖండ్ ప్రజలు బీజేపీకి స్పష్టమైన మెజారిటీతో విజయం కట్టబెట్టడంతో ప్రభుత్వం ఏర్పాటుకు ఆ పార్టీ సంప్రదింపులు ప్రారంభించింది. అయితే, సీఎం పదవి ఎవరిని వరించబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. ప్రధానంగా రఘువర్‌దాస్, సరయూరాయ్, మాజీ సీఎం అర్జున్‌ముండా సీఎం పదవి కోసం పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. బుధవారం ఢిల్లీలో జరిగే బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో జార్ఖండ్ సీఎం అభ్యర్థిపై నిర్ణయం తీసుకోనున్నారు.
సీఎం పీఠానికి అర్జున్ ముండా పేరుపై జార్ఖండ్ రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, ఎన్నికల్లో ఓడిపోవడం ముండాకు ప్రతికూలంగా మారనుంది. ప్రజలు తిరస్కరించిన వారికి బదులు కొత్తవారితో ప్రయోగం చేసేందుకు బీజేపీ సుముఖంగా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఇదే నిజమైతే ముండాకు సీఎం చాన్స్ లేనట్లే. ఇక, రఘువర్‌దాస్ 2010లో జార్ఖండ్ ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు.
బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాకు సన్నిహితుడు కావడం ఆయనకు కలిసొచ్చే అంశం. జంషెడ్‌పూర్ ప్రజల మద్దతును చూసి గర్విస్తున్నానని, జార్ఖండ్ ప్రజలకు సేవ చేసేందుకు తానెప్పుడూ వారికి అందుబాటులో ఉంటానని రఘువర్‌దాస్ ప్రకటించడం చూస్తే సీఎం పీఠంపై ఆయన ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. సరయూరాయ్‌కు ఆర్‌ఎస్‌ఎస్ మద్దతు సానుకూలాంశం. ఈ నేపథ్యంలో సీఎం పీఠం ఎవరికి దక్కుతుందన్నది బుధవారం తెలియనుంది.