
‘అఖిలేశ్.. నీ కేబినెట్‌లో రేప్ మంత్రి ఎందుకు?’
అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్తరప్రదేశ్ సమాజ్‌వాది పార్టీ నేత గాయత్రి ప్రజాపతి ఇంకా మీ కేబినెట్‌లో ఎందుకని ప్రశ్నిస్తూ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌కు ఆ రాష్ట్ర గవర్నర్ రామ్ నాయక్ లేఖ రాశారు.
లక్నో: అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్తరప్రదేశ్ సమాజ్‌వాది పార్టీ నేత గాయత్రి ప్రజాపతి ఇంకా మీ కేబినెట్‌లో ఎందుకని ప్రశ్నిస్తూ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌కు ఆ రాష్ట్ర గవర్నర్ రామ్ నాయక్ లేఖ రాశారు.ఇప్పటికీ ఆయనను ఎందుకు కేబినెట్‌లో కొనసాగిస్తున్నారని ప్రశ్నిస్తూ వివరణ కోరారు. దీనికి సంబంధించి వివరణ కోరుతూ ఆయన అఖిలేశ్ కు లేఖ పంపించినట్లు కూడా రాజ్‌భవన్ వర్గాల ద్వారా తెలుస్తోంది. లైంగిక దాడి కేసులో గాయత్రి ప్రజాపతిపై అరెస్టు వారెంట్ జారీ అయిన విషయం తెలిసిందే.
ఆయన తప్పించుకు తిరుగుతుండటంతో నాన్‌బెయిలబుల్ వారెంట్ కూడా ఇష్యూ అయింది. ఆయన పాస్‌పోర్టును నాలుగువారాలపాటు సీజ్ చేయడంతోపాటు లుకౌట్ నోటీసులు కూడా అంటించారు. ఈ నేపథ్యంలో ఇంకా కేబినెట్‌లో కొనసాగించడంపై గవర్నర్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రధాని మోదీ ఈ విషయంలో పలుమార్లు అఖిలేశ్‌పై దాడి చేసిన విషయం తెలిసిందే.
సుప్రీంకోర్టు కేసు నమోదు చేయించినా ఆ వ్యక్తి కోసం అఖిలేశ్ ప్రచారానికి వెళుతున్నారని ఎద్దేవా చేశారు. మరోపక్క, యూపీ బీజేపీ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా గవర్నర్ నోటీసుల నేపథ్యంలో స్పందించారు. తనకు ప్రియమైన గాయత్రిని అరెస్టు చేయలేకపోయినా కనీసం తన కేబినెట్‌లో నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.