ఉద్యమంలో రాజకీయాలు!
గూర్ఖాలాండ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉన్నదైనా.. డార్జిలింగ్ ప్రాంతంలో రాజకీయంగా పైచేయి సాధించటానికే తాజాగా ఉద్యమం సాగుతున్నట్లు కనిపిస్తోంది. ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులకు బెంగాలీ భాషను తప్పనిసరి చేస్తూ మమత బెనర్జీ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. నేపాలీ మాతృభాషగా ఉన్న గూర్ఖాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈనెల 8న మమత డార్జిలింగ్‌లో కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
మమత గోబ్యాక్ అంటూ పోలీసులపై దాడికి దిగిన నిరసనకారులు వారి వాహనాలను తగులబెట్టారు. జీజేఎం నాయకుడు బిమల్ గురుంగ్ ఆధ్వర్యంలో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌తో డార్జిలింగ్‌లో సోమవారం నుంచి నిరవధిక బంద్ జరుగుతోంది. వైద్యశాలలు, పాఠశాలలు, ఇతర అత్యవసర సేవలు మినహా ప్రభుత్వ కార్యాలయాలు ఏవీ పనిచేయవని గుర్ఖాలు ప్రకటించారు. మరోవైపు మమత కూడా కఠినవైఖరి తీసుకున్నారు. విధులకు రాకపోతే రికార్డుల్లో ‘సర్వీసు బ్రేక్’గా పరిగణిస్తామని ఉద్యోగులను హెచ్చరించారు. పరిస్థితులను అదుపులోకి తేవడానికి సైన్యాన్ని మోహరించారు.
పైచేయి సాధించాలనే ఆరాటం...
డార్జిలింగ్‌లో తాజా స్థితికి రాజకీయ ఆధిపత్యం సాధించాలనే ఆరాటమే కారణం. గూర్ఖాలాండ్‌లో బిమల్ గురుంగ్ మాటకు తిరుగులేదు. ఇక్కడ మమత బలపడటంతో ఆమెకు చెక్ పెట్టాలని గురుంగ్ భావించారు. బెంగాలీ తప్పనిసరన్న మమత నిర్ణయాన్ని సాకుగా తీసుకొని ఆందోళనలకు పిలుపునిచ్చారు. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ను తెరపైకి తెచ్చి ఉద్యమిస్తే ప్రజల్లో భావోద్వేగాలు పెంచడం ద్వారా పట్టు నిలుపుకోవాలనేది గురుంగ్ ఆలోచన.
బీజేపీని నిలువరించేందుకు దీదీ వ్యూహం..
ఉత్తర బెంగాల్‌లోని ఆరు జిల్లాల్లో బీజేపీ క్రమంగా బలం పెంచుకుంటోంది. ఈ జిల్లాలన్నింటిలో కలిపి 42 అసెంబ్లీ స్థానాలు ఉండటంతో బీజేపీ ఎదుగుదలను దీదీ ముప్పుగా భావిస్తున్నారు. చిన్నరాష్ట్రాలకు బీజేపీ సూత్రప్రాయంగా అనుకూలం. మంగళవారం స్థానిక బీజేపీ నేతలు జీజేఎంతో సమావేశంలో పాల్గొని గుర్ఖాలాండ్‌కు మద్దతు పలికారు. డార్జిలింగ్ చుట్టుపక్కల కొండప్రాంతాల్లోనే ప్రత్యేక గూర్ఖాలాండ్‌కు మద్దతు ఉందనీ, మైదాన ప్రాంతాల్లోని ప్రజలు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తారని మమత లెక్క. బీజేపీపై విభజనకు అనుకూలమనే ముద్రవేసి ఈ జిల్లాల్లో బీజేపీని దెబ్బతీయాలని దీదీ చూస్తున్నారు. పాపం అమాయక ఆదివాసీలే సెంటిమెంట్‌తో రోడ్డెకుతున్నారు.
110 ఏళ్ల డిమాండ్
డార్జిలింగ్‌తోపాటు సిలిగుడి, జల్‌పాయ్‌గుడిలోని కొన్ని ప్రాంతాలను కలిపి గూర్ఖాలాండ్ ఏర్పాటు చేయాలనేది 110 ఏళ్ల నుంచి ఉన్న డిమాండ్. ఇప్పటికీ తమను నేపాలీలనే సంబోధిస్తున్నారనేది గూర్ఖాల ఆవేదన. భాష, సాంస్కృతికపరమైన వైవిధ్యాల కారణంగా ప్రత్యేక రాష్ట్రంకోరుతున్నారు. పాలనా సంస్కరణల నిమిత్తం 1907లో భారత్‌లో పర్యటించిన మోర్లీ– మింటో ప్యానల్‌కు, 1952లో నెహ్రూకు, బాషాప్రయుక్త రాష్ట్రాల నిమిత్తం 1953లో ఏర్పాటైన ఎస్సార్సీ (రాష్ట్రాల పునర్విభజన కమిషన్)కి ప్రత్యేక గూర్ఖాలాండ్ ఏర్పాటు చేయాలనే వినతిపత్రాలు అందాయి.
రాజీవ్ హయాంలో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ హింసాత్మక మార్గంలోకి మళ్లింది. సుభాష్ ఘీషింగ్ నేతృత్వంలోని గూర్ఖా జాతీయ విమోచన ఫ్రంట్ ఉద్యమించింది. 1986–88 మధ్య జరిగిన హింసాత్మక ఆందోళనల్లో 1,200 మంది పౌరులు చనిపోయారు. ఆరో షెడ్యూల్‌లో చేర్చి గిరిజన ప్రాంతానికి కొంతమేరకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించారు. దీని పగ్గాలను గురుంగ్‌కు అప్పజెప్పారు మమత. అయితే 2013 చివర్లో తెలంగాణ ఏర్పాటుకు నాటి యూపీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో జీటీఏ చీఫ్‌గా గురుంగ్ రాజీనామా చేసి... మమతతో తెగదెంపులు చేసుకున్నారు.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్