సాక్షి, న్యూఢిల్లీ : కోల్‌కతా పోలీస్ కమిషనర్ నివాసంపై సీబీఐ దాడుల నేపథ్యంలో కేంద్రం, మమతా బెనర్జీల మధ్య వివాదం తీవ్రరూపుదాల్చింది. బెంగాల్‌లో శాంతి భద్రతల పరిస్ధితి గాడి తప్పుతోందని బీజేపీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సోమవారం ఈసీని కలిసి ఫిర్యాదు చేసింది. రానున్న సార్వత్రిక ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా నిర్వహించేందుకు బెంగాల్‌లో కేంద్ర బలగాలను మోహరించాలని విజ్ఞప్తి చేసింది.
ఈసీని కలిసిన బీజేపీ ప్రతినిధి బృందంలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, ముక్తార్ అబ్బాస్ నక్వీ, అహ్లూవాలియా పార్టీ సీనియర్ నేతలు, బీజేపీ బెంగాల్ ఇన్‌ఛార్జ్ కైలాష్ విజయవర్గీయ తదితరులున్నారు. రాష్ట్రంలో బీజేపీ నేతల ర్యాలీలను మమతా బెనర్జీ నేతృత్వంలోని బెంగాల్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటోందని బీజేపీ నేతలు ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ అధికారులను తొలగించాలని తాము ఈసీని కోరామని భేటీ అనంతరం కేంద్ర మంత్రి నక్వీ తెలిపారు. రాష్ట్రంలో స్వేచ్ఛగా, సజావుగా ఎన్నికల నిర్వహణ చేపట్టేందుకు కేంద్ర బలగాలను నియోగించాలని కోరామన్నారు. పశ్చిమ బెంగాల్‌లో నెలకొన్న దారుణ పరిస్థితులను ఈసీకి వివరించామన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను బెదిరిస్తూ, అకారణంగా నిర్భందిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీ నేతల ర్యాలీలకు అనుమతి నిరాకరిస్తూ వేధింపులకు గురిచేస్తున్న విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment