ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి తాము అనుకూలమంటూ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రకటన పశ్చిమబెంగాల్లో చిచ్చు రేపింది. గూర్ఖాలాండ్ రాష్ట్రం కోసం గత కొంత కాలంగా జీజేఎం నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె, బంద్ లాంటి వాటిని 72 గంటల్లోగా ముగించాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని సీఎం మమతా బెనర్జీ హెచ్చరిస్తే.. అలా అయితే రక్తపాతం తప్పదని జీజేఎం తిరిగి హెచ్చరించింది. మమతా బెనర్జీ తన అల్టిమేటంను ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో ప్రజలే స్వచ్ఛందంగా కర్ఫ్యూ అమలుచేస్తారని, రక్తపాతం కూడా తప్పదని జీజేఎం అధ్యక్షుడు బిమల్ గురుంగ్ తీవ్రస్వరంతో తెలిపారు. డార్జిలింగ్, కుర్సెయాంగ్, కలింపాంగ్ మూడు జిల్లాల్లోనూ గత ఎనిమిది రోజులుగా జనజీవనం పూర్తిగా స్తంభించింది.
''వాళ్ల బంద్ను ఉపసంహరించుకోడానికి వాళ్లకు 72 గంటల గడువు ఇస్తున్నాను. మేం ఎనిమిది రోజుల పాటు సహించాం. జరిగింది చాలు. కేవలం కొద్దిమంది రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రం మొత్తం ఇబ్బంది పడుతోంది. వాళ్లు ఉపసంహరించుకోకపోతే, కోర్టు ఉత్తర్వుల ప్రకారం కఠిన చర్యలు తీసుకోక తప్పదు. అవసరమైనప్పుడు మనం స్ట్రాంగ్గా ఉండే మందులు తీసుకోక తప్పదు'' అని సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో కలకత్తా హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ఆమె ప్రస్తావించారు. ప్రజాస్వామిక ప్రతిఘటనలను తాను సమ్మతిస్తాను గానీ, బంద్లు, ఇతర హింసాత్మక విధానాలను మాత్రం సహించేది లేదన్నారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవాలని చూసేవారు ఎవరైనా ఫలితం అనుభవించక తప్పదన్నారు. కొంతమంది 'కేంద్ర రాజకీయ నాయకులు' రాష్ట్రంలో విభజించి పాలించే విధానం మానుకోవాలని, కేంద్ర ఏజెన్సీలు తమ విషయంలో జోక్యం చేసుకోకూడదని కూడా మమత హెచ్చరించారు.
మమత ఈ మాట చెప్పగానే గురుంగ్ కూడా తీవ్రంగా స్పందించారు. మమతా బెనర్జీ ఇలా గడువులు పెట్టడం సరికాదని, లక్షలాది మంది ప్రజలు రోడ్లమీదకు వస్తారని ఆయన అన్నారు. ప్రజలను హతమార్చి రాజకీయాలు చేయాలనుకుంటే ప్రాణాలివ్వడానికి వారు సిద్ధమేనని చెప్పారు. తమ ఉద్యమం విషయంలో వెనకడుగు వేసేది లేదని, ఎవరైనా అడ్డుకోవాలని చూస్తే రక్తపాతం తప్పదని, దానికి మమతే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.
బెంగాల్లో అట్టుడుకుతున్న గూర్ఖాలాండ్ ఉద్యమం
Published Sat, Aug 10 2013 9:26 PM | Last Updated on Fri, Sep 1 2017 9:46 PM
Advertisement