ఇస్లామాబాద్ / న్యూఢిల్లీ : భారత్ సహా అంతర్జాతీయ సమాజం నుంచి వస్తున్న ఒత్తిడికి దాయాది దేశం పాకిస్తాన్ తలొగ్గింది. తాము అరెస్ట్ చేసిన భారత వాయుసేన(ఐఏఎఫ్) పైలట్, వింగ్ కమాండర్ వర్ధమాన్ అభినందన్‌ను శుక్రవారం విడుదల చేస్తామని ప్రకటించింది. పాక్‌లోని బాలాకోట్‌లో ఉన్న జైషే మొహమ్మద్ ఉగ్రవాదుల స్థావరంపై భారత్ మంగళవారం తెల్లవారుజామున వైమానిక దాడులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో పాక్ యుద్ధ విమానాలు మరుసటిరోజు భారత గగనతలంలోకి ప్రవేశించాయి. ఈ సందర్భంగా పాక్‌కు చెందిన ఎఫ్–16 యుద్ధ విమానాన్ని భారత్ నేలకూల్చగా, ఇండియాకు చెందిన రెండు ఫైటర్ జెట్లను కూల్చేశామనీ, వర్ధమాన్ అభినందన్ అనే పైలట్‌ను అరెస్ట్ చేశామని పాకిస్తాన్ ప్రకటించుకుంది. వర్ధమాన్ అరెస్టును ధ్రువీకరించిన భారత విదేశాంగ శాఖ.. జెనీవా నిబంధనల ప్రకారం అభినందన్ విషయంలో మానవతాదృక్పథంతో వ్యవహరించాలనీ, ఆయన్ను సురక్షితంగా విడిచిపెట్టాలని డిమాండ్ చేసింది. దీనికితోడు వర్ధమాన్ విడుదల విష యంలో అమెరికా, రష్యా, ఫ్రాన్స్, యూరోపియన్ యూనియన్ సహా పలుదేశాలు పాక్‌పై ఒత్తిడి తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో గురు వారం పార్లమెంటు ఉభయసభలను సమావేశపర్చిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, వర్ధమాన్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన విడుదలపై భారత వాయుసేన హర్షం వ్యక్తం చేసింది.
అందుకే భారత్‌పై దాడిచేశాం..
ఈ సందర్భంగా ఇమ్రాన్ పార్లమెంటులో మాట్లాడుతూ..‘శాంతిస్థాపనలో తొలి అడుగుగా భారత పైలట్ వర్ధమాన్ అభినందన్‌ను శుక్రవారం విడుదల చేయాలని నిర్ణయించాం. ఇది భారత్–పాకిస్తాన్‌ల మధ్య శాంతి చర్చలకు మొదటిమెట్టుగా మేం భావిస్తున్నాం. మా సామర్థ్యం, ఉద్దేశాన్ని స్పష్టం చేయడానికే పాక్ వాయుసేన భారత ఆర్మీ స్థావరాలపై దాడులు నిర్వహించింది. భారత్‌కు నష్టం చేకూర్చాలని మేం భావించడం లేదు. మేం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరుకుంటున్నాం’అని తెలిపారు. వర్ధమాన్‌ను విడుదల చేస్తామని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించగానే పాక్ చట్టసభ్యులు బల్లలు చరిచి తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.
యుద్ధానికి దిగితే ఇక అంతే..
ఒకవేళ భారత్ దురాక్రమణకు పాల్పడితే పాక్ దీటుగా స్పందిస్తుందని ఇమ్రాన్ ఖాన్ హెచ్చరించారు. ‘ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచవద్దని భారత అధినాయకత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. యుద్ధం అన్నది సమస్యలకు పరిష్కారం కానేకాదు. భారత్ ఇలాంటి తప్పుడు అంచనాలతో యుద్ధానికి దిగితే విపత్కర పరిస్థితులు తలెత్తుతాయి. ఇలాంటి చర్యల వల్ల దేశాలకుదేశాలే నాశనమైపోయాయి. ఒకవేళ భారత్ ఎలాంటి దుందుడుకు చర్యలు తీసుకున్నా, పాకిస్తాన్ దీటుగా ప్రతిస్పందిస్తుంది. పాక్ ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరతలను కోరుకుంటోంది. దీన్ని మా బలహీనతగా భావించవద్దు. మా బలగాలు యుద్ధరంగంలో పోరాటాలతో దాటుదేలాయి. ఎలాంటి పరిస్థితి ఎదురైనా తిప్పికొట్టేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నాయి’అని ఇమ్రాన్‌ఖాన్ స్పష్టం చేశారు. భారత్–పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలతో ఇరుదేశాలకు ఎలాంటి లాభం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడేందుకు తాను ప్రయత్నించానని ఇమ్రాన్ తెలిపారు. ఉపఖండంలో శాంతి, సుస్థిరత విషయంలో అంతర్జాతీయ సమాజం కీలకపాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.
బేషరతుగా, వెంటనే విడిచిపెట్టాలి: భారత్
అంతకుముందు భారత్ స్పందిస్తూ ఐఏఎఫ్ పైలట్ వర్ధమాన్ విడుదల కోసం పాకిస్తాన్‌తో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోబోమని తెలిపింది. వింగ్ కమాండర్ వర్ధమాన్ బేరసారాలాడే వస్తువు కాదనీ, ఈ విషయంలో ఎలాంటి చర్చలు జరపబోమని స్పష్టం చేసింది. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ..‘వర్ధమాన్ అభినందన్‌కు దౌత్య సాయం కల్పించాలని భారత్ పాకిస్తాన్‌ను కోరలేదు. ఆయన్ను బేషరతుగా, సురక్షితంగా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగాలా? తగ్గాలా? అనే విషయం పూర్తిగా పాకిస్తాన్‌పైనే ఆధారపడి ఉంది. పుల్వామా ఉగ్రదాడి విషయంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ త్వరితగతిన విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకోవాలి. చర్చల పేరుతో అంతర్జాతీయ సమాజాన్ని పాకిస్తాన్ తప్పుదారి పట్టిస్తోంది. పాకిస్తాన్ దాదాపు 20 యుద్ధవిమానాలతో బుధవారం భారత గగనతల ఉల్లంఘనకు పాల్పడింది’అని తెలిపారు. భారత సైనికస్థావరాలు లక్ష్యంగా దాడిచేయలేదన్న ఇమ్రాన్ ఖాన్ వాదనల్ని ఆయన ఖండించారు. మరోవైపు అమెరికా, చైనా, బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్ రాయబారులతో భారత విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే గురువారం సమావేశమయ్యారు. బాలాకోట్‌లోని జైషే ఉగ్రస్థావంపై ఐఏఎఫ్ దాడులకు ప్రతీకారంగా పాకిస్తాన్ భారత ఆర్మీ స్థావరాలు లక్ష్యంగా దాడిచేసిన విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లారు.
వర్ధమాన్ తండ్రిగా గర్వపడుతున్నా..
వింగ్ కమాండర్ వర్ధమాన్‌పై ఆయన తండ్రి రిటైర్డ్ ఎయిర్ మార్షల్ ప్రశంసలు కురిపించారు. ‘నా కుమారుడి ధైర్యసాహసాలపై నేను గర్వపడుతున్నా. వర్ధమాన్ క్షేమం కోరుతూ ప్రార్థనలు చేస్తూ, మద్దతు తెలిపిన ప్రతీఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నా. పాక్ కస్టడీలో ఉన్నప్పటికీ వర్ధమాన్ నిజమైన సైనికుడిలా వ్యవహరించాడు. నా కుమారుడిని పాకిస్తాన్ చేతిలో చిత్రహింసలకు గురికాకుండా క్షేమంగా ఇంటికి తిరిగొస్తాడని భావిస్తున్నా’అని తెలిపారు.
వెల్‌కమ్ అభినందన్
Published Fri, Mar 1 2019 1:18 AM | Last Updated on Fri, Mar 1 2019 10:35 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment