పొలిటికల్ బ్లాక్ మనీ స్కామ్: మమతా బెనర్జీ
కోల్కతా: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ క్యూలో నిలబడి పాతనోట్లను మార్చుకుంటే...తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పలు బ్యాంకులను సందర్శించారు. శనివారం ఆమె ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకుల్లో పర్యటించి, తాజా పరిణామాలపై అక్కడి కస్టమర్లతో మాట్లాడారు.
అనంతరం మమతా మాట్లాడుతూ... పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ చర్య అతిపెద్ద బ్లాక్ మనీ స్కామ్ గా ఆమె అభివర్ణించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఇప్పటికీ విజ్ఞప్తి చేశామని, మరోసారి దీనిపై పునరాలోచించాలన్నారు. యువత నుంచి వృద్ధులతో పాటు ప్రతి ఒక్కరూ పెద్ద నోట్ల రద్దుతో చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు.
రూ.2000 నోటును నిత్యావసరాలకు ఏవిధంగా ఉపయోగిస్తారని మమతా బెనర్జీ సూటిగా ప్రశ్నించారు. నిజమైన నల్ల కుబేరులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలే కానీ, ప్రజలను ఇబ్బందులు పెట్టరాదని మమతా బెనర్జీ అన్నారు. అవినీతికి పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని...అంతేకానీ సామన్యులను వేధించరాదని ఆమె సూచించారు. ఈ చర్య నల్ల రాజకీయ నిర్ణయం అంటూ కేంద్ర ప్రభుత్వంపై మమతా తన ట్విట్టర్లో విమర్శనాస్త్రాలు సంధించారు.